పుష్కరాల పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి!

👉 నవంబర్ 1 నుంచి మే 31 వరకు అన్ని పనులు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి !

👉 పెండింగ్ భూసేకరణ నోటిఫికేషన్లను సోమవారం నుంచి జారీ చేయాలి !

👉 రాత్రింబవళ్లు పనులు చేపట్టాలి… జాప్యం జరిగితే జిల్లాకు చెడ్డపేరు వస్తుంది !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!

J.SURENDER KUMAR,

2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాలకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.

గురువారం జగిత్యాల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్.ప్రసునాంబలతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ….


,పుష్కరాల పనులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ, పనులను సకాలంలో పూర్తి చేయకపోతే జిల్లాకు చెడ్డపేరు వస్తుందని అన్నారు. ప్రతి పనికి స్పష్టమైన షెడ్యూల్ రూపొందించుకొని, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు చేపట్టే ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ, అవసరమైన చోట జనరేటర్లు ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు పనులు చేపట్టాలని సూచించారు.
👉 నవంబర్ 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే 30వ తేదీ వరకు అన్ని శాఖలు తమ పరిధిలోని పనులను పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. నెలవారీ లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటి ప్రకారం పనుల పురోగతిని సమీక్షించాలని ఆదేశించారు.
👉 క్షేత్రస్థాయిలో ఎదురయ్యే చిన్నచిన్న సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని, హెడ్ ఆఫీస్ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అంశాలను ఉన్నతాధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
👉 భూసేకరణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్లను సోమవారం నుంచి జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆర్ అండ్ బి రోడ్లకు సంబంధించి 10-ఏ మినహాయింపు ప్రతిపాదనలు పంపించామని, అనుమతులు మూడు రోజుల్లో అందితే వెంటనే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించారు. ముందుగా భూమిని సేకరించి, పరిహారం చెల్లింపులు పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
👉 ధర్మపురిలో మహాలక్ష్మి ఘాట్, రోడ్డు విస్తరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపులను మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ధర్మపురి ఘాట్‌ను 270 మీటర్ల పొడవుతో అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు.
👉 ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునరుద్ధరణకు సంబంధించిన కూల్చివేత పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని, కోటిలింగాల ఆలయ కూల్చివేత పూర్తయినందున అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
👉 గోదావరి పుష్కరాల సందర్భంగా లక్షలాది భక్తులు రానున్న నేపథ్యంలో రోడ్లపై ఎట్టి పరిస్థితులలో ట్రాఫిక్ జామ్ జరగకుండా ముందస్తు పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని వాహనాలు సులభతరంగా వెండే విధంగా రూట్ మ్యాప్ లను సిద్ధం చేయాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.
👉 ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ పుష్కరాలకు సంబంధించిన పనులు వేగవంతంగా పూర్తి అయ్యేవిధంగా చూడాలని అధికారులకు సూచించారు. మే 31,2027 నాటికి ప్రతిపాదించిన పనులు పూర్తి చేసుకోగలిగితేనే పుష్కరాలకు వచ్చే కోట్లాది భక్తులకు అసౌకర్యం కలగకుండా ధార్మికంగా పుణ్యస్నానాలు దైవదర్శనం సజావుగా జరుగుతుందని ఆదేశాగా మనం ముందస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు
👉 గత పుష్కర స్నానాల సమయంలో మురికి నీరు, కొంత గోదావరి నదిలో కలవడం వల్ల వివాదం అయిందని ఆ పరిస్థితి రాబోయే పుష్కరాల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
👉 సివరేజ్ పనుల కోసం అవసరమైతే అదనపు బడ్జెట్ కేటాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని దేశంలో ఈ పనులు వేగవంతంగా నాణ్యతతో చేపట్టే వారిని గుర్తించి తీసుకొని రావాలని మంత్రి తెలిపారు

ఈసమీక్ష సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్. దినేష్, ఆర్.డి.ఓ. లు, పి.ఆర్, ఆర్&బి, పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ ఇంజనీరింగ్ , దేవాదాయ, మున్సిపల్, రెవెన్యూ , పోలీస్ శాఖల అధికారులు , సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.