👉 ఉన్నత వేతనాల ఉద్యోగాలు సాధించండి !
👉 142కు పైగా కంపెనీలు.. రెండు గంటల్లోనే 600 మందికి పైగా ప్రాథమిక ఎంపిక.!
👉 భూపాలపల్లి మెగా జాబ్‌మేళాలో మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు.!
J.SURENDER KUMAR,
చదువు ఒక్కటే కాదు.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉన్నత వేతనాలతో కూడిన ఉద్యోగాలను సాధించగలమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు యువతకు పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్‌లో శుక్రవారం టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీల స్టాళ్లను సందర్శించి ఉద్యోగ నియామక ప్రక్రియను పరిశీలించారు.
👉 రెండు గంటల్లోనే 600 మందికి పైగా ప్రాథమిక ఎంపిక !
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవతో నిర్వహించిన ఈ జాబ్‌మేళాలో 142కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చారని మంత్రి తెలిపారు. జాబ్‌మేళా ప్రారంభమైన రెండు గంటల్లోనే 600 మందికి పైగా అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపికైనట్లు వెల్లడించారు. కొన్ని కంపెనీలు ఒక్కొక్కటి 100 నుంచి 400 మందికి పైగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొన్నారు.
ప్రారంభంలో నెలకు ₹10 వేల నుంచి ₹20 వేల వేతనంతో ఉద్యోగంలో చేరినా, అనుభవం సంపాదిస్తూ నైపుణ్యాలను పెంచుకుంటే భవిష్యత్తులో ₹50 వేల నుంచి.
₹ 70 వేల వరకు వేతనం పొందే అవకాశాలుంటాయని వివరించారు. యువత ఉద్యోగాల కోసం ప్రాంతీయ పరిమితులకు లోబడి ఉండకుండా, ఎక్కడ మంచి అవకాశం లభించినా అందిపుచ్చుకోవాలని సూచించారు.
👉 తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలి..!
వ్యవసాయం, కూలీ పనులు, చిన్నచిన్న వ్యాపారాలు చేస్తూ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. వారి కష్టాన్ని గుర్తించి యువత పట్టుదలతో ముందుకు సాగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు. విద్యార్హతలతో పాటు వృత్తి నైపుణ్యాలు ఉన్నప్పుడే మెరుగైన ఉద్యోగాలు, పదోన్నతులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ అందించేందుకు ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీతో పాటు టాస్క్ ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ప్రైవేటు సంస్థలతో సమన్వయం చేసుకుంటూ శిక్షణ పొందిన యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
👉 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు..!
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 70 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. గ్రూప్-1, 2, 3, 4 పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తూ అర్హులకు అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ తదితర విద్యార్హతలు కలిగిన యువతకు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగాలు సాధించేందుకు మెగా జాబ్‌మేళాలు ఉపయోగపడతాయని చెప్పారు.
👉 భూపాలపల్లి అభివృద్ధికి ప్రాధాన్యం !

భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధి, పట్టణంలో రోడ్ల విస్తరణతో పాటు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగానే మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
👉 10 వేల నుంచి 12 వేల ఉద్యోగావకాశాల అంచనా..!
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ భూపాలపల్లి నిరుద్యోగ యువతకు మెగా జాబ్‌మేళా ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 10 వేల నుంచి 12 వేల వరకు ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. గత సంవత్సరం నిర్వహించిన మెగా జాబ్‌మేళా ద్వారా 2,700 మందికి ఉద్యోగావకాశాలు కల్పించినట్లు వివరించారు.
టాస్క్ ద్వారా జిల్లాలో నైపుణ్యాభివృద్ధి శిక్షణను మరింత విస్తరించనున్నట్లు చెప్పారు. సింగరేణి సంస్థ సహకారంతో శిక్షణ కేంద్రానికి విశాలమైన హాలు, ఏసీ వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నామని, యువత ఈ అవకాశాలను వినియోగించుకొని తమ కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.
👉 అర్హతకు తగిన ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలి !
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మెగా జాబ్‌మేళాలో 142కు పైగా కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. స్థానికంగానే కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున యువత తమ విద్యార్హతలు, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలను సాధించాలని సూచించారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక పత్రాలను అందజేశారు. జాబ్‌మేళా నిర్వహణలో విశేష కృషి చేసిన జిల్లా యంత్రాంగాన్ని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంకీర్త్, టాస్క్ సీఈఓ ప్రదీప్‌రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, కంపెనీల ప్రతినిధులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.
