👉 పుష్కరపనులు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి !
👉 ధర్మపురి, కోటిలింగాల ఆలయాల పునర్నిర్మాణం, పుష్కరాల ఏర్పాట్లపై సచివాలయంలో అధికారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహ స్వామి వారి దేవస్థానం మరియు కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి వారి దేవస్థానాల పునర్నిర్మాణ పనులు, రానున్న పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎండోమెంట్ కమిషనర్ హనుమంత రావు జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మరియు సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈసమావేశంలో ధర్మపురి మరియు కోటిలింగాల పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యత, ఆలయాల పునర్నిర్మాణానికి సంబంధించిన అంశాలు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, రానున్న పుష్కరాల సందర్భంగా చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి అధికారులతో విస్తృతంగా చర్చించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ……
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం, కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి వారి క్షేత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పుణ్యక్షేత్రాలని పేర్కొన్నారు. ఈ ప్రాంతాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, అందుకు అనుగుణంగా ఆలయాల అభివృద్ధి, పునర్నిర్మాణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
👉 ఆలయాల పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి….!

ధర్మపురి శ్రీ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం మరియు కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయాల పునర్నిర్మాణ పనులను సమగ్ర ప్రణాళికతో చేపట్టాలని మంత్రి సూచించారు. ఆలయాల ప్రాచీనత, చారిత్రక ప్రాధాన్యత, సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నియమాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు తెలిపారు.
👉 పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష…!
రానున్న పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్యుత్, వైద్య సదుపాయాలు, పార్కింగ్, రవాణా సౌకర్యాలు, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు తెలిపారు.
👉 పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని,ఘాట్ల అభివృద్ధి, స్నానాల కోసం సురక్షితమైన ఏర్పాట్లు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

👉 ధర్మపురి మరియు కోటిలింగాల పుణ్యక్షేత్రాల అభివృద్ధితో పాటు పుష్కరాల ఏర్పాట్లను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని, సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు.
👉 భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా ప్రభుత్వం తరఫున అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
