ధర్మపురి పోలీసుల అదుపులో జేబు దొంగలు!

👉 భక్తుల రద్దీని ఆసరాగా చేసుకోవాలనుకున్నారు.. పోలీసుల నిఘాకు చిక్కిపోయారు!


👉 కార్తీక మాసం రద్దీలో జేబుదొంగల ముఠా ఆటకట్టు.. అరగంటలో ఐదుగురు పట్టివేత!


👉 ముందస్తు పోలీసు నిఘా.. బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్ల చాకచక్యం..


👉 ధర్మపురిలో పోలీసుల అప్రమత్తతకు అభినందనలు

J.SURENDER KUMAR,

ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురికి కార్తీక మాసం సందర్భంగా భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో.. భక్తుల రక్షణే లక్ష్యంగా పోలీసులు ముందస్తు నిఘా ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని జేబుదొంగతనాలకు పాల్పడాలని వచ్చిన ఐదుగురు వ్యక్తుల ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు.

ఒక భక్తుడి జేబులో నుంచి నగదు అపహరించిన ఘటనపై వెంటనే స్పందించిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి, కేవలం అరగంట వ్యవధిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వేగవంతమైన స్పందనకు స్థానికులు, యువకులు అభినందనలు తెలిపారు.


👉 బస్సులో జేబు కొట్టారు.. దిగగానే పరారయ్యే ప్రయత్నం!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో మంచిర్యాల డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో గూడెం గ్రామానికి చెందిన గుండ సత్తయ్య (46) ప్రయాణిస్తున్నారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న గుర్తుతెలియని వ్యక్తి ఆయన షర్టు జేబులో ఉన్న ₹4 వేల నగదును అపహరించి, ధర్మపురిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బస్సు నుంచి దూకి పరారయ్యాడు. వెంటనే బాధితుడు కూడా అతని వెనుకే వెళ్లినా నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు.

👉 సీసీ కెమెరాలే కీలక ఆధారం.. కదలికలపై నిఘా!

అదే ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు పరకాల రణధీర్ (పీసీ నం.1650), అరికిల్ల సంజీవ్ (పీసీ నం.1493) బాధితుడి నుంచి సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తాము ఐదుగురం కలిసి వచ్చినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

👉 ఆటోలో జారుకునే ప్రయత్నం.. వెంబడించి పట్టుకున్న పోలీసులు!

వెంటనే మిగతా నలుగురి ఆచూకీ కోసం గాలింపు చేపట్టిన కానిస్టేబుళ్లు.. వారు ఆటోలో వెళ్తున్నట్లు గుర్తించి వెంబడించారు. చాకచక్యంగా ఆటోను అడ్డుకుని ఐదుగురినీ అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా తమ వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

👉 ఐదుగురి వివరాలు..
బోడకుంట వాసుదేవ్ (54) – హమాలీవాడ, మంచిర్యాల.
బీరవత్తుల రంగారావు (45) – చర్చి కాలనీ, మంచిర్యాల.
కాండ్రకొండ నాగరాజు (48) – చర్చి కాలనీ, మంచిర్యాల.
దొమ్మాటి రాయమల్లు (50) – చర్చి కాలనీ, మంచిర్యాల.
కనకుల గోపి (29) – నందిగామ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
వారిలో ఒకరి వద్ద సోదా చేయగా బాధితుడి నుంచి అపహరించినట్లు తెలిపిన ₹4 వేల నగదు లభించినట్లు పోలీసులు వెల్లడించారు.

👉 అరగంటలోనే పోలీసుల ఆపరేషన్ పూర్తి!

సాయంత్రం 5 గంటల సమయంలో జరిగిన ఘటనపై బ్లూకోల్ట్స్ సిబ్బంది వెంటనే స్పందించి, సుమారు  గంటలకే ఐదుగురిని అదుపులోకి తీసుకోవడం పోలీసుల అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటనపై ధర్మపురి ఎస్‌ఐ నాగపురి సదాకర్ కేసు నంబర్ 282/2026, సెక్షన్ 303(2) బీఎన్‌ఎస్–2023 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

👉 పోలీసుల అప్రమత్తతకు స్థానికుల అభినందనలు!

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం, బాధితుడి ఫిర్యాదుపై క్షణాల్లో స్పందించడం, సీసీ కెమెరాల సహాయంతో నిందితుల కదలికలను గుర్తించడం, పరారయ్యే ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. ఈ పరిణామాల్లో బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్లు రణధీర్, సంజీవ్ చూపిన చొరవను అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉన్న గ్రామస్తులు, యువకులు అభినందించారు.