👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
అభివృద్ధి అంటే అద్దాల మేడల్లో, రంగుల గోడల్లో కాదు. తెలంగాణ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యపై పెట్టే ఖర్చు భవిష్యత్తు పెట్టుబడి అని సంపూర్ణంగా విశ్వసిస్తా. విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావాలి, అంటరానితనాన్ని, అసమానతలను నిర్మూలించాలి” అని సీఎం పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలంటే అనాధలు, ఆర్థికంగా చితికిపోయిన వారు చదువుకుంటారన్న అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలన్న సంకల్పంతో ఆరుట్ల గ్రామంలో ప్రారంభించిన తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిలషించారు.
👉 కార్పొరేట్ స్థాయికి ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అత్యాధునిక వసతులతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తీర్చిదిద్దిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇదే సందర్భంగా విద్యార్థులకు ఉదయం అందించే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు.

👉 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ……
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులకు ఆరుట్ల పబ్లిక్ స్కూల్ స్ఫూర్తిగా నిలుస్తుందంటూ, పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేనేజ్‌మెంట్ కమిటీకి అభినందనలు తెలిపారు.
👉 “ప్రభుత్వ పాఠశాల అనగానే తక్కువగా భావించే విధంగా అందరి మదిలో నెలకొన్న అనుమానం, అపనమ్మకాలను పోగొట్టాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విధంగా కుటుంబాల్లో ఆత్మవిశ్వాసం పెంచాలి. ప్రభుత్వ బడుల్లో చదువుకుంటే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ లుగా రాణించగలరన్న ఒక బృహత్తర సంకల్పంతో ఈ పాఠశాలను తీర్చిదిద్దాం. ఆరుట్ల పాఠశాల తెలంగాణకు ఒక రోల్ మోడల్ గా, స్ఫూర్తిదాయకంగా నిలవాలి” అని అన్నారు.
👉 “విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించే విధంగా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆదర్శంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా. ఈ స్కూల్ రోల్ మోడల్ గా ఎలా నిలుస్తుందో ఎవరొచ్చినా చూపించాలి. ఈ అద్భుతమైన కార్యానికి ప్రజలు సంపూర్ణంగా అండదండలు అందించాలి” అని ముఖ్యమంత్రి కోరారు.

👉 మూడు లక్షల కోట్లపైన ఉన్న రాష్ట్ర బడ్జెట్ లో 8 శాతానికి పైగా దాదాపు ₹ 26 వేల కోట్ల రూపాయలు విద్యా శాఖపైన, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
👉 “ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు పాఠశాలలో 1814 మంది పిల్లలు పాఠశాలలో చేరగా, సీట్లు ఖాళీ లేవని, అడ్మిషన్లు పూర్తయ్యాయని ప్రభుత్వ పాఠశాల బయట బోర్డు పెట్టే పరిస్థితికి రావడం పట్ల కమిటీని అభినందిస్తున్నా. ఉపాధ్యాయులు తెలంగాణ సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలబడ్డారు” అని ముఖ్యమంత్రి వారిని అభినందించారు.
👉 “ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో వచ్చిన అనుభవాలను పాఠాలుగా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఇతర స్కూళ్లను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఈ స్కూళ్లలో చదివి రేపటి భవిష్యత్తు నాయకులుగా తయారవుతారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం” ఆశాభావం వ్యక్తం చేశారు.
👉 “తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి , ఆరుట్ల కమలాదేవి పాత్ర మరువలేనిది. అందుకే ఇక్కడ పాఠశాలను తీర్చిదిద్దాం. ఆరుట్ల గ్రామ ప్రజలు, తల్లిదండ్రులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలో తీసుకుని ప్రతి పేదవారికి విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం” అని వివరించారు.

👉 “ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటే చిన్నతనం కాదు. ముఖ్యమంత్రిగా నేనే కాదు. దేశంలో గొప్ప గొప్ప వాళ్లంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారే. కేవలం సంక్షేమ పథకాలు భవిష్యత్తును మార్చలేవు. మన భవిష్యత్తు మారాలన్నా, తల్లిదండ్రులు ఆత్మగౌరవంతో బతకాలంటే చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మన ఊరికి, మన రాష్ట్రానికి, దేశానికి పేరొస్తుంది” అని హితవు చెప్పారు.
👉 “ఎవరెన్ని విమర్శలు చేసినా, విద్యా సంస్కరణలతో ముందుకు వెళుతూ కేజీ నుంచి పీజీ వరకు అత్యుత్తమ విద్యను అందించాలన్నది మా సంకల్పం. విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. వివిధ కులాల వారిగా వేర్వేరుగా పాఠశాలలు ప్రారంభించి కులాలు, వర్గాల అడ్డుగోడలు నిర్మించి విభజన చేస్తున్న విధానికి స్వస్తి పలకాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చేపట్టాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.
👉 ముఖ్యమంత్రి స్కూల్ కిట్ల గురించి చెబుతూ “ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన స్కూల్ డ్రెస్సులు, షూలు, సాక్సులు, దుప్పట్లు, స్కూల్ బ్యాగులతో కూడిన కిట్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో, అంతర్జాతీయ సంస్థలతో తయారు చేయిస్తున్నాం. ₹ 688 కోట్లతో టెండర్లు పిలిచాం. పనులు జరుగుతున్నాయి. జూలై ఆఖరు నుంచి వాటిని పంపిణీ చేస్తామని చెప్పారు”
👉 “మాదక ద్రవ్యాల వాడకం ఒక మహమ్మారిగా మారింది. ఈ దురలవాట్లను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ నెల 19వ తేదీన ఎల్బీ స్టేడియం వేదికగా రాష్ట్ర గవర్నర్ సమక్షంలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వేలాది మంది విద్యార్థినీ విద్యార్థులతో ప్రమాణం చేయించే కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులను చైతన్యం చేసే కార్యక్రమం చేపడుతున్నాం”
👉 గంజాయి లేదా ఇతరత్రా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి విద్యార్థులను కోరారు.
👉 “ఏఐతో ప్రపంచ వ్యాప్తంగా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో నైపుణ్యాలను నేర్పించి బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాం. మొదటి ఏడాదిలోనే అందరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కి మంచి అవకాశాలు పొందడం సంతోషించదగిన విషయం” అని వ్యాఖ్యానించారు.
👉 “140 కోట్ల జనాభా కలిగిన దేశం నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో రాణించలేకపోతున్నాం. ఒక్క స్వర్ణ పతకాన్ని కూడా సాధించలేకపోతున్నామంటే తలదించుకోవలసిన పరిస్థితి. అందుకే పబ్లిక్ – ప్రైవేట్ మోడల్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నాం. విద్యార్థులు, క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపడానికే ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్ రప్పించాం” అని గుర్తుచేశారు
👉 ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకుని తెలంగాణ నలుమూలల స్ఫూర్తిగా నిలవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 27 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని పేర్కొన్నారు.
