👉 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే లక్ష్యమా..?
👉 ఇసుక, ధాన్యం పేరుతో ఆరోపణల వెనుక రాజకీయ వ్యూహమా..?
👉 మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కొలువాయి గోదావరి తీరం ఎందుకు గుర్తుకు రావడం లేదు..?
J SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేచింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న దళిత నాయకుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ వరుస ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కోణం ఉందా అనే చర్చ సాగుతోంది. ఇటీవల ఇసుక అక్రమ రవాణా, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నాయంటూ మాజీ మంత్రులు చేస్తున్న విమర్శలు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న రాజకీయ వ్యూహంలో భాగమేనని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి.

👉 జిల్లాలో కాంగ్రెస్ బలపడటమే కారణమా..?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై విజయం సాధించిన లక్ష్మణ్ కుమార్ జిల్లాలో కాంగ్రెస్‌కు కీలక నాయకుడిగా ఎదిగారు. అనంతరం ప్రభుత్వ విప్‌గా, తర్వాత మంత్రిగా పదోన్నతి పొందడం ఆయన రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచింది.
జిల్లాలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆధిక్యం రావడం, జగిత్యాల, కోరుట్ల, మెట్టుపల్లి మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ప్రభావం పెరగడం, ధర్మపురి మున్సిపాలిటీలో అన్ని కౌన్సిలర్ స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడడం వంటి పరిణామాలు ప్రతిపక్షాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
👉 సభ్యత్వ నమోదు సమావేశంలో రాజకీయ ఆరోపణలే హైలైట్..!
ఈ నెల తొలి వారంలో ధర్మపురిలో జరిగిన బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు సమావేశంలో సభ్యత్వ నమోదు కంటే మంత్రి లక్ష్మణ్ కుమార్‌పై చేసిన ఆరోపణలకే ఎక్కువ ప్రాధాన్యత లభించిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సభ్యత్వ కార్యక్రమంపై సమీక్ష కంటే ఇసుక అక్రమ రవాణా, ధాన్యం కొనుగోళ్ల అంశాలను ప్రస్తావిస్తూ మంత్రిని టార్గెట్ చేయడం రాజకీయ ఉద్దేశ్యంతోనేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
👉 మల్లాపూర్ – ఇబ్రహీంపట్నం – కొలువాయి ప్రాంతాలపై మౌనం ఎందుకు..?
కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, జగిత్యాల పరిధి లో కొలువాయి ప్రాంతాల్లో గోదావరి తీరం వెంట ఇసుక రవాణాపై స్థానికంగా తరచూ చర్చ జరుగుతున్నప్పటికీ, ఆ అంశాలపై మాజీ మంత్రులు స్పందించకపోవడం వెనుక కారణాలేమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అదే విధంగా ఇతర నియోజకవర్గాల్లో ధాన్యం కొనుగోళ్లు, ఇసుక రవాణా అంశాలపై మౌనం పాటిస్తూ కేవలం ధర్మపురి నియోజకవర్గానికే పరిమితమై విమర్శలు చేయడం రాజకీయ లక్ష్యాలను సూచిస్తోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
👉 కాంగ్రెస్ క్యాడర్ – మైనార్టీల మద్దతు కూడా కారణమా..?
జిల్లాలో సంప్రదాయ కాంగ్రెస్ క్యాడర్ ఇప్పటికీ బలంగా ఉండటంతో పాటు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ప్రధాన క్యాడర్, ఆయన వెంట బిఆర్ఎస్ లోకి వెళ్లకుండా పార్టీలో, నామినేటెడ్ పదవులలో, మీకు న్యాయం జరుగుతుంది, అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇవ్వడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి తో వీరి సమావేశం ఏర్పాటు చేసి క్యాడర్ పార్టీ మారకుండా చూడడం, జిల్లాలోని మండలాలలోని బీఆర్ఎస్ నాయకులు కూడా మంత్రితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో వివిధ వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నాయకులతో మంత్రి లక్ష్మణ్ కుమార్ తో పాటు మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ హజార్ఉద్దీన్ నిర్వహించిన సమావేశాలకు విశేష స్పందన రావడం కూడా ప్రతిపక్ష నేతలకు అసహనంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
👉 సీఎం దృష్టికి చేరాలనే ప్రయత్నమా..?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై ఆయన చేసే ఆరోపణలు నేరుగా సీఎం దృష్టికి వెళ్తున్నాయనే భావన బీఆర్ఎస్ నేతల్లో ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.
దీంతో మంత్రి లక్ష్మణ్ కుమార్‌పై చేస్తున్న విమర్శలు కూడా రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యం పొందాలని భావించి చేస్తున్న రాజకీయ ప్రయత్నంగా కొందరు విశ్లేషిస్తున్నారు.
👉 రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రశ్న !

“జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను పక్కనపెట్టి, కేవలం దళిత మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని బి ఆర్ ఎస్ లీడర్ లు మాజీ మంత్రులు జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ లు మాత్రమే పని గట్టుకొని ఆరోపణలు చేయడం, జిల్లాలో ఆ పార్టీ క్యాడర్ మౌనంగా ఉండడం వెనక అసలు రాజకీయ వ్యూహం ఏమిటి?” అనే ప్రశ్న ప్రస్తుతం జగిత్యాల జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
