న్యూస్ క్లిక్ పోర్టల్ పై కేసు కొట్టివేత !

👉 తీర్పును స్వాగతించిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU)

J SURENDER KUMAR,

న్యూస్ క్లిక్ పోర్టల్ పైనా, ఆ సంస్థ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ పైన డిల్లీ పోలీస్ శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్. ను , అనంతరం ఇ.డి. పెట్టిన కేసును కొట్టివేస్తూ డిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ శుక్రవారం విడుదల చేసిన ఒక మీడియా ప్రకటనలో స్వాగతించింది.

ఈతీర్పు దేశంలో మీడియా స్వేచ్ఛను కోరుకునే వారికి ఒక నైతిక విజయమని, స్వతంత్ర గొంతులను, విమర్శనాత్మక జర్నలిజాన్ని అణచివేయడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు ఒక చెంప పెట్టు అని ఐజేయూ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ జమ్మూ, సెక్రెటరీ జనరల్ డి.సోమసుందర్, ఉపాధ్యక్షుడు వై.నరేందర్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


ప్రధాన మీడియా సంస్థలు కార్పోరేట్ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రాపగాండా కోసం పనిచేస్తున్న నేపథ్యంలో న్యూస్ క్లిక్ ప్రజల వాణిని గట్టిగా వినిపించడానికి కృషి చేసిందని, న్యూఢిల్లీలో జరిగిన రైతుల ఉద్యమాన్ని నిరంతరాయంగా రిపోర్ట్ చేసి అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించిందని , దాంతో పాలకవర్గం న్యూస్ క్లిక్ గొంతును అణచి వేయడానికి తప్పుడు అభియోగాలతో
ఆగస్టు 26, 2020న ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW)
కేసులు నమోదు చేయించిందని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆ ప్రకటన లో గుర్తు చేసింది.

👉ఆ సంస్థ ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ ( ఫైల్ ఫోటో)

ఈకేసులను , అరెస్టులను ఐ.జే.యు. తీవ్రంగా ఖండించి న్యూస్ క్లిక్ కు మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడంలో ఐజేయూ తనవంతు కృషి చేసిందని ఆ ప్రకటనలో పేర్కొన్నది.


డిల్లీ హైకోర్టు తనతీర్పు ద్వారా ఎఫ్.ఐ.ఆర్. ను క్వాష్ చేయడమే కాకుండా ఈ వ్యవహారంలో చట్టాన్ని దుర్వియోగం చేసినట్లు పేర్కొనడం ద్వారా పాలకపక్షానికి గట్టి హెచ్చరిక చేసిందని, ఐజేయూ మీడియా ప్రకటన పేర్కొన్నది. ప్రభుత్వ సంస్థలు స్వతంత్ర జర్నలిస్టులను వేధించడాన్నితక్షణం నిలిపివేయాలని, న్యూస్ క్లిక్ పై నమోదు చేసిన ఇతర అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఐ.జే.యు. ఆ ప్రకటనలో డిమాండ్ చేసింది.