నిర్లక్ష్య అధికారుల పై కఠిన చర్యలు తప్పవు !

👉 వాతావరణ శాఖ ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినా !


👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న సందర్భంగా జూన్ 1వ తేదీన సమీక్ష నిర్వహించి తాను స్వయంగా అనేక సూచనలు చేశానని గుర్తుచేశారు. అయినప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

👉 వర్షాకాల సీజన్‌లో అధికారులు, యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

👉 వర్షాకాల సన్నద్ధతపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పేవిలియన్‌లో ముఖ్యమంత్రి  ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ, వాతావరణ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

👉 జూన్ 9న కోర్ అర్బన్ రీజియన్‌లో వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులు, తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి  ఆరా తీశారు. సైబరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో నగరవాసులు ఇబ్బందులు పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

👉 జూన్ 9న నగరంలో వర్షం సమయంలో మున్సిపల్, పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపించిందన్నారు. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు , డీజీపీ సీవీ ఆనంద్‌ ల ను ఆదేశించారు.

👉 వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి  స్పష్టంగా చెప్పారు. వర్షం కురిసిన సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితో పాటు సివిల్ పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

👉 పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందేనని తేల్చిచెప్పారు. అవసరమైతే తాను కూడా రోడ్డుపైకి వస్తానని అన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డీజీపీకి సూచించారు.

👉 మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని హెచ్చరించారు. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్‌స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు.

👉 వర్షం కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంపై ముఖ్యమంత్రి  సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలని సూచించారు. అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు.

👉 సీజన్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలన్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలని పేర్కొన్నారు.

👉 ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ని ఆదేశించారు.

👉 వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి  సూచించారు. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలన్నారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

👉 యూరియా స్టాక్, పంపిణీ కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన ఎనిమిది రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

👉 వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు. గతంలో తాగునీటి కలుషితం కారణంగా జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలని జలమండలి అధికారులను ఆదేశించారు.

👉 నీటి కలుషితం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షాల కారణంగా నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

👉 మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, జలమండలి, వైద్య ఆరోగ్య శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌ కి ముఖ్యమంత్రి  సూచించారు. పోలీసు, ట్రాఫిక్, ఫైర్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని డీజీపీని ఆదేశించారు.