👉విచారణకు స్వీకరిస్తుందా? సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తుందా ?
J.SURENDER KUMAR,
అయోధ్య రామ మందిర విరాళాల అవకతవకలపై సుప్రీంకోర్టు జూన్ 29న (సోమవారం) కీలక విచారణ జరపనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ సిట్ తన ప్రాథమిక నివేదికను సమర్పించిన నేపథ్యంలో, పిటిషన్‌ను క్రమబద్ధమైన విచారణకు స్వీకరిస్తుందా ? , సిబిఐ దర్యాప్తునకు ఆదేశిస్తుందా ? అనేది అత్యంత ఉత్కంఠభరితంగా మారింది.
ఈ వివాదంపై దాఖలైన ప్రజాహిత పిటిషన్ (పిల్) ను తక్షణమే అత్యవసరంగా విచారించాలన్న పిటిషనర్ల అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. క్రమబద్ధమైన ప్రక్రియ ప్రకారం జూన్ 29న తమ ముందు ఈ అంశాన్ని మళ్లీ ప్రస్తావించాలని న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ బి.వి. నాగరత్న మరియు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌ను పరిశీలించనుంది.
జూన్ 29న ప్రాథమిక వాదనలు విన్న తర్వాత ఈ కేసును రెగ్యులర్ బెంచ్‌కు బదిలీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని లీగల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ మరియు నరేంద్ర కుమార్ గోస్వామిలు ఈ పిటిషన్లను దాఖలు చేశారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, కాబట్టి సిబిఐ ఆధ్వర్యంలో బహుళ-విభాగాల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి కోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు.
కేసు దర్యాప్తు తేలేవరకు ఆలయంలోని కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ ), డిజిటల్ పేమెంట్ రికార్డులు, మరియు విరాళాల పత్రాలను ఎవరూ ట్యాంపరింగ్ చేయకుండా భద్రపరచాలని కోరారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు వచ్చిన అన్ని విరాళాలు, నిధులపై పూర్తి స్థాయి స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.
ఈ పిటిషన్ కేవలం విరాళాల లెక్కింపు, నిధుల దుర్వినియోగం వంటి లౌకిక, పరిపాలనా లోపాలపై మాత్రమేనని పిటిషనర్లు స్పష్టం చేశారు. ఆలయ మతపరమైన ఆచారాలు, సంప్రదాయాల్లో కోర్టు జోక్యం కోరడం లేదని స్పష్టం చేశారు. జాతీయ ప్రాధాన్యత కలిగిన ఇలాంటి పెద్ద దేవాలయాల పబ్లిక్ విరాళాల నిర్వహణలో పారదర్శకత కోసం నిర్దిష్టమైన రాజ్యాంగ భద్రతా నిబంధనలను రూపొందించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.
👉 ట్రస్ట్ సభ్యుడి ఫిర్యాదుతో కేసు నమోదు నిందితులు అరెస్టు, కొనసాగుతున్న సిట్ దర్యాప్తు!
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కుంభకోణం అత్యంత పకడ్బందీగా సాగుతున్నప్పటికీ, చివరకు ట్రస్ట్ అంతర్గత ఆడిట్ మరియు సీసీటీవీ కెమెరాల నిఘా కారణంగా వెలుగులోకి వచ్చింది .ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాత ఈ మేరకు ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్, అయోధ్యలోని కోత్వాలీ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.

సీసీటీవీ ఆధారాలు బలంగా ఉండటంతో పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి 8 మందిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేశారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అకౌంటెంట్లు రోజూవారీ, వారపు విరాళాల లెక్కలను ఆడిట్ చేస్తున్నప్పుడు, భక్తులు సమర్పించిన విరాళాల రసీదులకు, బ్యాంకులో జమ అవుతున్న అసలు నగదుకు మధ్య భారీ తేడాలు ఉన్నట్లు గమనించారు.
భారీ మొత్తంలో నగదు మాయమవుతోందని ట్రస్ట్ అధికారులకు అనుమానం వచ్చింది. ట్రస్ట్ సీనియర్ సభ్యుడు కృష్ణ మోహన్ నేతృత్వంలో విరాళాల లెక్కింపు గది లోని నిఘా కెమెరాల ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ తనిఖీల్లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. నగదు లెక్కింపు విధుల్లో ఉన్న కొందరు సిబ్బంది నోట్లను లెక్కిస్తున్నట్లు నటిస్తూ, పెద్ద నోట్ల కట్టలను అత్యంత చాకచక్యంగా తమ జేబుల్లో, బూట్లలో మరియు దుస్తుల లోపల దాచుకోవడం సీసీటీవీల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. కెమెరా నిఘా లేని బ్లైండ్ స్పాట్స్ ను ఉపయోగించుకుని హుండీ డబ్బును పక్కదారి పట్టిస్తున్నారన్న సంగతి స్పష్టమైంది.
నిందితులు కేవలం భౌతిక నగదును మాత్రమే కాకుండా, విరాళాల డేటాను రికార్డ్ చేసే కంప్యూటర్ సిస్టమ్స్‌లో కూడా మార్పులు చేస్తున్నట్లు ఐటీ విభాగం గుర్తించింది. దీనితో దర్యాప్తు బృందం నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు మరియు డిజిటల్ రికార్డులను స్వాధీనం చేసుకుంది. అందులో వారు జరిపిన అక్రమ లావాదేవీల లాగ్‌లు లభ్యమయ్యాయి.
ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కు అత్యంత నమ్మకస్థుడైన మాజీ డ్రైవర్ ‘తిన్నూ యాదవ’ ఆలయ ప్రాంగణంలో, ముఖ్యంగా నగదు లెక్కింపు జరిగే పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరగడం అధికారుల కంట పడింది. ఆయనను ప్రత్యేకంగా విచారించగా, ఆలయ సిబ్బందితో కలిసి భక్తుల సొమ్మును బయటకు తరలించడానికి ఒక నెట్‌వర్క్ నడుపుతున్నట్లు తేలింది.
