ఆర్టీసీకి 553 బస్సులకు అదనంగా మరో 3 వేల బస్సులు అప్పగిస్తాం !

👉 మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,

రానున్న రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా మరో 3 వేల బస్సులను ఆర్టీసీకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  ప్రకటించారు. మహిళా శక్తి పథకం కింద ఈరోజు ఆర్టీసీకి అప్పగించిన 553 బస్సులకు అదనంగా మరో 3 వేల బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అప్పగిస్తామని చెప్పారు.


👉 ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి  పాల్గొన్నారు. మహిళా శక్తి పథకం – మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సుల నిర్వహణను టీజీఆర్టీసీకి అప్పగించే కార్యక్రమంలో బస్సులకు ముఖ్యమంత్రి  జెండా ఊపి ప్రారంభించారు.


👉 ఈ కార్యక్రమంలో మంత్రులు ధనసరి అనసూయ సీతక్క , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


👉 కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదన్నారు. జిల్లా, మండల, గ్రామ సంఘాలు ఎవరు బస్సులు కొనుగోలు చేసినా ఆర్టీసీకి అప్పగించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.


👉 “స్వయం సహాయక సంఘాల్లో ప్రస్తుతం 67 లక్షల మంది సభ్యులున్నారు. కోటి మందిని సభ్యులుగా చేర్పించండి. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే బాధ్యత నాది” అంటూ మహిళల సంక్షేమానికి తీసుకున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రి  ఈ సందర్భంగా సమగ్రంగా వివరించారు.


👉 “మహిళా శక్తికి ఈ ప్రభుత్వంలో చోటుంది. 2034 వరకు కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. త్వరలోనే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తా. మహిళా సంఘాలు స్థానికంగా వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి” అని చెప్పారు.


👉 “రాష్ట్రంలో రైతులు లాభసాటి వ్యవసాయం దిశగా ఆలోచనలు చేయాలి. పంటల మార్పిడి జరగాలి. వడ్లు, మొక్కజొన్నలే కాదు కందులు, మినుములు, పెసళ్ల వంటి పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేయాలి. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవడానికి ₹ 2,400 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను ప్రారంభించుకున్నాం” అని గుర్తుచేశారు.


👉 “పంట మార్పిడిపై రైతులు, రైతు సమాఖ్యలకు అవగాహన కల్పించాలి. మహిళా సంఘాలు ఆ బాధ్యతను తీసుకోవాలి. మహిళా సంఘాల్లో చదువుకున్న అవగాహన కలిగిన మహిళలు రైతుల్లో చైతన్యం కల్పించాలి” అని కోరారు.


👉 “ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడానికి సంపూర్ణంగా సహకరిస్తా. మహిళల పర్యవేక్షణ ఉంటే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా సాగుతాయని చాలా విషయాల్లో నిర్వహణ బాధ్యతను వారికే అప్పగిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరు మీదే మంజూరు చేస్తున్నాం.


👉 పట్టణాల్లో 1 లక్ష ఇండ్లు కట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ ఇండ్లను కూడా మహిళ పేరిటే ఇస్తాం. ఆస్తి ఏదున్నా ఆడబిడ్డల పేరునే ఉండాలి. మంచి మనసుతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి వరుణ దేవుడు కూడా కరుణించారు” అని ముఖ్యమంత్రి  సంతోషం వ్యక్తం చేశారు.


👉 “మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ₹ 10 వేల కోట్లకు పైగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది. అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో రాష్ట్రంలోని 27 వేల పాఠశాలల నిర్వహణ బాధ్యత ఆడబిడ్డలకు అప్పగించాం.


👉 మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతనిచ్చాం. పెట్రోల్ బంకులను అప్పగిస్తున్నాం. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ స్థలాలు ఎక్కడున్నా గుర్తించి పెట్రోల్ పంపులు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కలెక్టర్లను ఆదేశించాం. 8 వేల స్త్రీ శక్తి భవనాలను ఒకేసారి ప్రారంభించుకున్నాం.


👉 భవిష్యత్తులో ప్రణాళికలు రచించుకోవడానికి జిల్లా కేంద్రాల్లో మహిళా శక్తి భవనాలు కార్పొరేట్ స్థాయిలో రాబోతున్నాయి. స్వయం సహాయక సంఘాలకు ₹ 61 వేల కోట్లు బ్యాంకు లింకేజీ ఇవ్వడమే కాకుండా సున్నా వడ్డీ కింద బ్యాంకులకు ₹ 2 వేల కోట్లు చెల్లించాం” అని చెప్పారు.


👉 మహిళా శక్తి, మహాలక్ష్మి పథకాల్లో భాగంగా స్వయం సహాయక సమాఖ్య, మండల మహిళా సమాఖ్యలకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  చెక్కులను అందజేశారు. ఆర్టీసీకి అప్పగించిన బస్సులపై అద్దె రూపేణా ₹ 20.34 కోట్ల చెక్కు, ఉచిత ప్రయాణం కింద ఆదా చేసిన ₹10,700 కోట్లు, వడ్డీ లేని రుణ పథకం కింద ₹ 500 కోట్ల చెక్కులను అందించారు.