👉 ఉద్యమకారుల గుర్తింపులో ప్రాధాన్యత ఇవ్వాలి !
👉 చైర్మన్ కేకే కు వినతి పత్రాన్ని ఇచ్చిన టీయుడబ్ల్యూజే !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన చారిత్రాత్మక
మహా ఉద్యమంలో, క్రియాశీలక పాత్రను పోషించిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి, వారి సేవలకు, త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) ప్రభుత్వాన్ని కోరింది.
టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో మంగళవారం యూనియన్ ప్రతినిధి బృందం, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కె. కేశవరావును బంజారా హిల్స్ లోని ఆయన నివాసంలో సమావేశమై వినతి పత్రాన్ని అందించింది.
👉 ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ…..
ఉద్యమ సమయంలో జర్నలిస్టులు కేవలం వార్తలను సేకరించి ప్రచారం చేసే బాధ్యతకే పరిమితం కాలేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఆవేదనను, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేస్తూనే, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, వాస్తవాలను ప్రజలకు చేరవేసి ఉద్యమానికి నైతిక బలం చేకూర్చడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించారని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న వివక్షను, సామాజిక-ఆర్థిక అసమానతలను, ప్రాంతీయ అన్యాయాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చారన్నారు. అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులు ఉద్యమకారులతో కలిసి ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని, పలుచోట్ల ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీలకు నాయకత్వం వహించారని ఆయన గుర్తుచేసారు.
ఉద్యమ సమయంలో పోలీసులు జర్నలిస్టులపై లాఠీచార్జీలు జరిపిన సంఘటనలు ఎన్నో చోట్ల చోటుచేసుకున్నాయని, ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీతో పాటు పలు చోట్ల పోలీసులు కెమెరాలను ధ్వంసం చేయడం, వార్తా సేకరణను అడ్డుకోవడం, జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, గాయపర్చడం వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు.
విధినిర్వహణలో జర్నలిస్టులు వెనుకడుగు వేయiలేదని, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యతను నిర్వర్తించారన్నారు. అలాగే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు పలువురు జర్నలిస్టులు తమ ఉద్యోగాలను కూడా కోల్పోయారని, కొందరు యాజమాన్యాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారని, మరికొందరు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అయినా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేశారని విరాహత్ తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక కమిటీ ఈ అంశాన్ని సానుభూతితో పరిశీలించి, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని సేవలందించిన జర్నలిస్టులకు ఉద్యమకారులుగా గుర్తింపు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో జర్నలిస్టుల సేవలు, త్యాగాలు చిరస్థాయిగా నిలిచేలా కమిటీ న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన అభ్యర్తించారు. కమిటీ చైర్మన్ కేకే ను కలిసిన వారిలో విరాహత్ అలీతో పాటు టీయుడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కల్కూరి రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎ. రాజేష్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (HUJ) అధ్యక్షుడు శిగా శంకర్ గౌడ్ తదితరులు ఉన్నారు.
👉 అధ్యయనం చేసి న్యాయం చేస్తాం !
-కే. కేశవరావు

తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియ ప్రారంభం అయ్యిందని, రాజకీయ, రాజకీయేతర రంగాలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు కమిటీ చైర్మన్ కె. కేశవరావు టీయుడబ్ల్యూజే బృందంతో తెలిపారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆయా కోణాల్లో సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేసారు. ఉద్యమ సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని, ఆయా రంగాల ఉద్యమకారులను గుర్తించనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో పాటు ఆయా జిల్లాల నుండి సేకరించిన సమాచార నివేదికలు, ఆయా వర్గాలతో ప్రత్యేక సంప్రదింపులు నిర్వహించి, ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో సీనియర్ పాత్రికేయులతో కమిటీ సమావేశమై వారి సలహాలు కూడా తీసుకుంటుందని కేశవరావు అన్నారు.
