ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అరెస్ట్ !

J.SURENDER KUMAR,


ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. రైతులను బెదిరించి ₹ 50 వేలు వసూలు చేసినందుకు ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

👉 వివరాలు ఇలా ఉన్నాయి..

తలమడుగు ఎస్సై డి రాధిక కథనం ప్రకారం…
తలమడుగు మండలంలోని  కజ్జర్ల గ్రామానికి చెందిన రైతులు కజ్జర్ల, దేవాపూర్ రోడ్డుకు ఇరువైపులా అటవీ శాఖ ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ విస్తరించి ఉంది.

ఈ అవెన్యూ ప్లాంటేషన్ పరిసరాల్లోనే వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. అయితే రైతులు తమ పంట పొలాల్లోని శేషాలను తొలగించేందుకు నిప్పంటించారు. ఈ క్రమంలో మంటలు విస్తరించి అవెన్యూ ప్లాంటేషన్ కు కూడా అంటుకోవడంతో కొంతమేర నష్టం జరిగింది.

ఈ నేపథ్యంలో  ఫారెస్ట్ బీట్ ఆపీషర్ కృష్ణ నాయక్, ఇందుకు బాధ్యులైన రైతులను బెదిరింపులకు గురి చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ లోని మొక్కలు కాలిపోయాయని ఇందుకు పరిహారం చెల్లించాలని, లేనట్టయితే క్రిమినల్ కేసు నమోదు చేస్తానని బెదిరించాడు.. ₹ 1.50 లక్షలు ఇవ్వాలని బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్ రైతులను డిమాండ్ చేశారు..

దీంతో భయపడిపోయిన రైతులు ₹ 50 వేలు అతనికి ముట్టజెప్పారు. చింతలపెల్లి జైభరత్ రెడ్డి ₹ 25,000, యెల్మ రఘువరన్ రెడ్డి ₹10,000, తాండ్ర మహేష్ ₹.7,500, తాండ్ర నర్సింహులు ₹ 7,500 చొప్పున ₹ 50,000 బీట్ ఆఫీసర్ కు ఇచ్చారు.


మరో లక్ష రూపాయల కోసం బీట్ ఆఫీసర్ బెదిరించడంతో..
బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు ఎస్సై రాధిక తెలిపారు.