గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలి !

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్  !


J.SURENDER KUMAR,

గ్రామాల సమగ్ర అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి గ్రామంలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెగడపల్లి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం గ్రామ సర్పంచులు, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన గ్రామ, మండల అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధి పనులు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామ పంచాయతీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్పంచులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు.


వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి తక్షణమే పరిష్కరించాలని, అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు పాల్గొన్నారు.