గుర్తింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి !


👉 టీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ !


J.SURENDER KUMAR,


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన మహా ఉద్యమంలో, క్రియాశీలక పాత్రను పోషించిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి, వారి సేవలకు, త్యాగానికి తగిన గౌరవం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె. విరాహత్ అలీ కోరారు.


మంగళవారం నాడు ట్యాంక్ బండ్ లోని తెలంగాణ అమర జ్యోతిలో, తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం, సంక్షేమంపై, జర్నలిస్టులతో ఉద్యమ గుర్తింపు కమిటీ నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

👉 ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ……

ఉద్యమ సమయంలో జర్నలిస్టులు కేవలం వార్తలను సేకరించి ప్రచారం చేసే బాధ్యతకే పరిమితం కాలేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఆవేదనను, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేస్తూనే, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను, వాస్తవాలను ప్రజలకు చేరవేసి ఉద్యమానికి నైతిక బలం చేకూర్చడం వంటి కీలక బాధ్యతలను నిర్వర్తించారని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న వివక్షను, సామాజిక-ఆర్థిక అసమానతలను, ప్రాంతీయ అన్యాయాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చారన్నారు. అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులు ఉద్యమకారులతో కలిసి ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని, పలుచోట్ల ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీలకు నాయకత్వం వహించారని ఆయన గుర్తుచేసారు.

ఉద్యమ సమయంలో పోలీసులు జర్నలిస్టులపై లాఠీచార్జీలు జరిపిన సంఘటనలు ఎన్నో చోట్ల చోటుచేసుకున్నాయని, ఉద్యమానికి కేంద్రంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీతో పాటు పలు చోట్ల పోలీసులు కెమెరాలను ధ్వంసం చేయడం, వార్తా సేకరణను అడ్డుకోవడం, జర్నలిస్టులపై తప్పుడు కేసులు నమోదు చేయడం, బెదిరింపులకు పాల్పడడం, గాయపర్చడం వంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు.

అయినా విధినిర్వహణలో జర్నలిస్టులు వెనుకడుగు వేయలేదని, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యతను నిర్వర్తించారన్నారు. అలాగే ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నందుకు పలువురు జర్నలిస్టులు తమ ఉద్యోగాలను కూడా కోల్పోయారని, కొందరు యాజమాన్యాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారని, మరికొందరు తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినందుకు ఉద్యోగాలకు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అయినా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేశారని విరాహత్ తెలిపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక కమిటీ ఈ అంశాన్ని సానుభూతితో పరిశీలించి, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని సేవలందించిన జర్నలిస్టులకు ఉద్యమకారులుగా గుర్తింపు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

తెలంగాణ ఉద్యమ చరిత్రలో జర్నలిస్టుల సేవలు, త్యాగాలు చిరస్థాయిగా నిలిచేలా కమిటీ న్యాయమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన అభ్యర్తించారు. ఈ సందర్భంగా యూనియన్ వినతిపత్రాన్ని కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్, శోభన్ రెడ్దిలకు అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.