👉 వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసి పట్టాలి ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంగా చేపట్టాలి !
👉 సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం !
J SURENDER KUMAR,
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపనున్న సూపర్ ఎల్‌నినో పరిస్థితులను రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా ఎదుర్కొని రైతులు, ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మిషన్ మోడ్‌లో పనిచేయాలని వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు, పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రకృతి సవాలును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు, ప్రజలు అందరూ ఒక్కటై పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సూపర్ ఎల్‌నినో ప్రభావ తీవ్రతను తగ్గించేందుకు రూపొందించిన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయ రమణారావు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మహేష్ దత్ ఎక్కా, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో కలిసి పాల్గొన్నారు.
సమావేశంలో సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రాజెక్టుల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రోత్సాహం, విద్యుత్ సరఫరా, రైతులకు అవగాహన కార్యక్రమాలు, జిల్లాల వారీగా కార్యాచరణ ప్రణాళికలు, భవిష్యత్ వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు తమ జిల్లాల్లో చేపడుతున్న చర్యలను సమావేశంలో వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖల అధికారులకు మంత్రులు కీలక సూచనలు చేశారు.

👉 మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ…..
ప్రస్తుత సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సూపర్ ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను ఇప్పటికే ప్రారంభించిందన్నారు. గత ఏప్రిల్ నెల నుంచే రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమాలు, గ్రామసభల ద్వారా రైతులకు సూపర్ ఎల్‌నినో పరిస్థితులపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రకృతి పరిస్థితులను ముందుగానే రైతులకు వివరించి నష్టాలను తగ్గించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
👉 సూపర్ ఎల్‌నినో ప్రభావం వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలపై పడే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ రిజర్వాయర్ నుంచీ సాగునీటిని విడుదల చేసే పరిస్థితి లేదని, రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు కూడా తలెత్తే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.
👉 ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రవ్యాప్తంగా రైతాంగాన్ని అప్రమత్తం చేసేందుకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
👉 రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఈ ప్రకృతి విపత్తును సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు. ప్రస్తుతం పడుతున్న చిరు జల్లులను చూసి రైతులు తొందరపడి ఎక్కువ నీటి అవసరమయ్యే పంటల వైపు వెళ్లవద్దని మంత్రి సూచించారు.
👉 రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే తొమ్మిది రోజుల్లో ₹ 9 వేల కోట్ల రైతు భరోసా నిధులను విడుదల చేసిందని గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ఈ ప్రకృతి సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలమన్నారు.
👉 మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ,….
ఎల్‌నినో ప్రభావం రాష్ట్రం ముందున్న అతిపెద్ద సవాల్ అని, రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేసి రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
👉 రైతులు, ప్రజలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తొలిసారిగా ముందస్తు ప్రణాళికతో సమగ్ర కార్యాచరణ చేపట్టిందన్నారు. జిల్లాల కలెక్టర్లు స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌తో క్షేత్రస్థాయిలో పనిచేస్తూ రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
👉 రైతులను ఆదుకోవాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్న ఆయన, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి రైతులు, ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. విలువైన సూచనలు, సలహాలను ప్రభుత్వానికి అందించి ఈ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
👉 మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,….
సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షపు నీటి ప్రతి చుక్కను ఒడిసిపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఉద్యమంలా చేపట్టాలని, ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేసే సమయంలో రైన్ వాటర్ హార్వెస్టింగ్, ఇంకుడు గుంతల నిర్మాణాన్ని తప్పనిసరి చేయాలని అధికారులకు సూచించారు.
👉 జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రజలందరూ ఇంకుడు గుంతలు నిర్మించేలా యుద్ధ ప్రాతిపదికన విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.వర్షపు నీటి ప్రతి చుక్కను భూమిలోకి పంపించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని, దీనిని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు కలిసి ఉమ్మడి గొంతుకతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ,….
కరోనా మహమ్మారి సమయంలో అందరూ సమిష్టిగా పనిచేసి సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించినట్లే, ఇప్పుడు సూపర్ ఎల్‌నినో కారణంగా ఏర్పడుతున్న విపత్కర పరిస్థితులను కూడా అదే స్ఫూర్తితో సమన్వయంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
👉 రాబోయే రోజుల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులు, ప్రజలను కాపాడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
👉 పంచాయతీ కార్యదర్శుల నుంచి జిల్లా కలెక్టర్ల వరకు అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, గ్రామ గ్రామాన రైతులకు సూపర్ ఎల్‌నినో ప్రభావం, వాస్తవ పరిస్థితులు, నీటి లభ్యత, ప్రత్యామ్నాయ పంటలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. పరిస్థితులను దాచిపెట్టకుండా రైతులకు స్పష్టంగా వివరించి, శాస్త్రీయ సూచనలు అందించాలని పేర్కొన్నారు.
👉 ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ…..
గ్రామ సభలు, రైతు వేదికల ద్వారా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో రైతులను చైతన్యపరచాలని సూచించారు. ముఖ్యంగా కందుల సాగును ప్రోత్సహించాలని, ప్రస్తుతం మార్కెట్లో కందులకు మంచి డిమాండ్ ఉన్నందున రైతులు ఆ దిశగా ఆలోచిస్తే ఆర్థికంగా లాభపడతారని అన్నారు.
👉 ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ….
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రకృతి విపత్తులు, కరువు పరిస్థితులపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామసభలు, రైతు వేదికల ద్వారా ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల ప్రాధాన్యాన్ని వివరించాలని సూచించారు. వరికి బదులుగా కందులు, నువ్వులు, జొన్నలు, పప్పుధాన్యాలు వంటి ఆరుతడి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని కోరారు. ఆగస్టు వరకు కూడా ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశం ఉందని తెలిపారు.
👉 ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, తదితర ప్రజా ప్రతినిధులు, మేయర్లు, ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, సీపీలు, ఎస్పీలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇరిగేషన్, భూగర్భ జలాలు, విద్యుత్ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
