👉 శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు!
👉 ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థన !
J.SURENDER KUMAR,
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం వరుణ యాగంలో పాల్గొన్నారు.

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..

వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా ఈ ఏడాది వర్షాలు ఆలస్యమవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల జీవితాల్లో ఆనందం నిండాలని సంకల్పంతో ధర్మపురి క్షేత్రంలో వరుణ యాగం నిర్వహించినట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల శ్రేయస్సే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఆ లక్ష్యానికి అనుగుణంగానే వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఉదయం సంకల్పం, కలశ గణపతి పూజ, 108 కలశాల స్థాపన, వరుణ జపాలు, 108 కలశాలతో శ్రీ రామలింగేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం, అనంతరం వరుణ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య యాగం ముగిసింది.

ఈ కార్యక్రమంలో , దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి రాజేష్, మార్కెట్ కమిటీ చైర్మెన్ చిలుముల లావణ్య లక్ష్మణ్, ఆలయ మాజీ అధ్యక్షుడు జే .రవీందర్ సూపరింటెండెంట్ ఎ.శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపప్రధాన అర్చకులు నేరళ్ల శ్రీనివాసచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసచార్యులు, అర్చకులు నంబి అరుణ్ కుమార్, స్థానిక పండితులు పాలెపు చంద్రమౌళి, కాసర్ల వంశీకృష్ణ, పాత గణేష్, పాత నటరాజ్ శర్మ, సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
👉 ఋగ్వేదపారాయణదారు నియామకం !

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంథని క్షేత్రానికి చెందిన వేద పండితుడు నల్లూరి ఒంకారశర్మ ను ఋగ్వేదపారాయణ దారుడిగా దేవాదాయ శాఖ నియమించింది. కార్యనిర్వహణాధికారి ప్రొసిడింగ్ ఇన్ ఆర్.సి.నెం.ఇ/203/2025-01, 2026 జూలై 17 న ఋగ్వేదపారాయణదారు గ్రేడ్-II గా విధులలో చేరారు. స్థానిక వేద పండితులు అభ్యర్థన మేరకు మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వం ద్వారా నియమించారు.
