👉 ప్రభుత్వానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక నివేదిక..?
👉 పుష్కరాల శాశ్వత వారసత్వంగా వరద నివారణ గట్టు నిర్మించాలని ప్రతిపాదన !
👉 భక్తుల భద్రతతో పాటు ధర్మపురి పట్టణ రక్షణే లక్ష్యం !
J.SURENDER KUMAR,
2027 గోదావరి మహా పుష్కరాల సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో చేపట్టనున్న అభివృద్ధి పనులతో పాటు, గోదావరి వరదల నుంచి ధర్మపురి పట్టణానికి శాశ్వత రక్షణ కల్పించే వరద నివారణ గట్టు నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమగ్ర నివేదిక సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం.
పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక ఘాట్లు, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, భవిష్యత్తులో వరదల సమయంలో పట్టణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా శాశ్వత పరిష్కారంగా వరద గట్టు నిర్మాణాన్ని చేపట్టాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

👉 195 మీటర్ల ఎత్తులో కొత్త ఘాట్ల ప్రతిపాదన !
ఈ నెల 13న జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇంజనీరింగ్ అధికారులతో పుష్కర పనులపై సమీక్ష జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన సమయంలో ప్రస్తుతం ఉన్న ఘాట్లు, ఆలయ పరిసరాలు నీటమునిగే అవకాశం ఉన్నందున, 195 మీటర్ల ఎత్తులో కొత్త స్నాన ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించినట్లు సమాచారం. ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధి సిద్ధార్థ్ టియర్–1, టియర్–2, టియర్–3 ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
👉 పుష్కరాలు – వర్షాకాలం… వరద ముప్పు తప్పదా ?
2027 జూలైలో గోదావరి పుష్కరాలు వర్షాకాలంలోనే జరగనున్నాయి. ఇదే సమయంలో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిస్తే గోదావరి పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులు నిండిపోవడం, శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి వరద నీటిని విడుదల చేయడం ఆనవాయితీగా జరుగుతోంది. దీంతో ధర్మపురి వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహించి ప్రతి ఏడాది పట్టణాన్ని ముంపు భయానికి గురిచేస్తోంది.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పుష్కరాల ఏర్పాట్లతో పాటు వరద రక్షణ చర్యలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
👉 వరదల చేదు జ్ఞాపకాలు… శాశ్వత పరిష్కారం అవసరం !

1983, 1995 సంవత్సరాల్లో సంభవించిన గోదావరి వరదలు ధర్మపురిలో తీవ్ర విధ్వంసం సృష్టించాయి. వందలాది కుటుంబాలు ఇళ్లు కోల్పోవడంతో ప్రభుత్వం వరద బాధితుల కాలనీలు నిర్మించి పునరావాసం కల్పించింది. టీటీడీ వసతి గృహం, హరిత హోటల్, ఓరియంటల్ డిగ్రీ కళాశాల, సంస్కృత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ సబ్‌స్టేషన్, వాసవి నిత్యాన్న సత్రం, దత్తాత్రేయ, సంతోషిమాత ఆలయాలు వరద నీటిలో మునిగాయి.
తెనుగువాడ, గంపలవాడ, కుమ్మరివాడ, బోయవాడ, కాపువాడ ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టం జరిగింది. రాజారం, ఆరేపల్లి, దమ్మన్నపేట, రాయపట్నం, స్తంభంపల్లి, కోటిలింగాల ప్రాంతాల్లో రైతుల పంటలు దెబ్బతిన్నాయి.
👉 అమలుకు నోచుకోని వరద గట్టు ప్రతిపాదన !

1995 గోదావరి వరదల అనంతరం ధర్మపురి, కోటిలింగాల, మంథని, కాలేశ్వరం తదితర ప్రాంతాల్లో వరద గట్టు నిర్మాణం చేపడతామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధర్మపురికి వచ్చి బాధితులను పరామర్శించి హామీ ఇచ్చారు. నాడు ప్రభుత్వం హామీ ఇచ్చిన అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతమవుతున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనను పునరుద్ధరించి అమలు చేయాలనే డిమాండ్ బలపడుతోంది.
👉 మంత్రి సమీక్షల్లో శాశ్వత అభివృద్ధిపైనే దృష్టి.!

పుష్కరాలకు రోజుకు 10 నుంచి 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని, ఘాట్లు, దేవాలయాల అభివృద్ధి, వీఐపీ మార్గాలు, మహిళలు, పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, ట్రాఫిక్ నిర్వహణ, బైపాస్ రహదారులు, పార్కింగ్, వైద్య శిబిరాలు, విద్యుత్, పారిశుద్ధ్య ఏర్పాట్లపై మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులకు పదేపదే ఆదేశాలు ఇస్తున్నారు. ట్రయల్ రన్ నిర్వహించి లోపాలను ముందుగానే గుర్తించి సరిదిద్దాలని కూడా సూచించారు.
ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయంపై ఆశలు
పుష్కరాల కోసం ఖర్చు చేసే నిధులు కేవలం తాత్కాలిక ఏర్పాట్లకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూరేలా వరద గట్టు నిర్మాణం, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తే ధర్మపురి రూపురేఖలు మారుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం మంత్రి ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించి త్వరలోనే వరద గట్టు నిర్మాణానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
