👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గిరిజన విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు బాలికల ఆశ్రమ పాఠశాలను శనివారం మంత్రి సందర్శించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ ప్యానెల్‌ను ప్రారంభించిన మంత్రి, అనంతరం విద్యార్థినులకు ఏకరూప దుస్తులు, కిట్లను పంపిణీ చేశారు.
👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…….

ఆశ్రమ, గురుకుల పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
విద్యార్థులకు యూనిఫాంలు, షూస్, పుస్తకాలు, పోషకాహారం తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు సీఆర్‌టీ సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతులు, పోషకాహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.

👉 ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (FLN) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ, నెలవారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

👉 ఉమ్మడి జిల్లా ఐటీడీఏ పరిధిలోని 400కు పైగా గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు ₹ 20 కోట్లతో మరమ్మతు పనులు చేపట్టినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

👉 అనంతరం మంత్రి, కలెక్టర్, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
