👉 వైద్యుడు మనిషి ఆరోగ్యాన్ని కాపాడితే.. చెట్టు సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతుంది !
👉 పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో 1200 మొక్కలు నాటడం పర్యావరణ పరిరక్షణకు బృహత్ కార్యక్రమం !
👉 ప్రతి మెడికో ఒక చెట్టును దత్తత తీసుకోవాలి” కేఎంసీ అలూమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి !
J SURENDER KUMAR,
ఒక వైద్యుడు మనిషి ఆరోగ్యాన్ని కాపాడతాడు.. ఒక చెట్టు సమాజ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న అంతర్లీన సంబంధాన్ని ఆలోచనగా తీసుకుని, ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు ప్రముఖ కార్డియాలజిస్టు, కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి హెచ్‌ఓడీ, డైరెక్టర్, కాకతీయ మెడికల్ కాలేజ్ అలూమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి.

వైద్య విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు పూర్వ విద్యార్థుల సంఘం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాకతీయ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు, ప్రముఖ గుండె వైద్య నిపుణులు, కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి హెచ్‌ఓడీ, డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణంలో ఏకంగా 1200 మొక్కలను నాటారు.

తాము వైద్య విద్యను అభ్యసించిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీపై తమకున్న ప్రేమ, ఆత్మీయత, బాధ్యతను మరోసారి చాటుకున్నారు డాక్టర్ శ్రీధర్. ఒకప్పుడు పచ్చదనంతో కళకళలాడిన కేఎంసీ ప్రాంగణాన్ని తిరిగి హరితవనంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఆయన చేపట్టిన కార్యక్రమం ఇప్పుడు హరిత స్ఫూర్తిగా మారింది.
👉 ఒక్కరోజులో 1,200 మొక్కలు ….
కేఎంసీ అలూమ్ని అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేఎంసీ ప్రాంగణాన్ని మళ్లీ పచ్చదనంతో నింపాలి.. మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించాలి” అనే లక్ష్యాన్ని డాక్టర్ శ్రీధర్ ముందుకు తీసుకెళ్లారు. శ్రీధర్ కస్తూరి ఇచ్చిన పిలుపునకు పూర్వ విద్యార్థులు స్పందించడంతో ఒక్కరోజులోనే దాదాపు 1,200 మొక్కలను నాటడం సాధ్యమైంది.
“Think BIG” అనే దృక్పథంతో ముందుకు సాగిన శ్రీధర్ ఆలోచనకు డాక్టర్ సునీత కస్తూరి ఆర్థిక సహకారం, విశ్రాంత అటవీ అధికారి రవీందర్ సమన్వయం, అటవీ శాఖ సహకారం మరింత బలాన్ని చేకూర్చాయి. జిల్లా కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఒక సామూహిక హరిత ఉద్యమంగా మారింది.

👉 ప్రతి మెడికో ఒక చెట్టును దత్తత తీసుకోవాలి !
. “ మన చెట్టు.. మన బాధ్యత ” అంటూ ఆయన ఇచ్చిన పిలుపు విద్యార్థుల్లో పర్యావరణ బాధ్యతను పెంపొందించేలా ఉంది. చెట్ల సంరక్షణపై పోటీలను నిర్వహించేందుకు కూడా ప్రోత్సహించడం ద్వారా మొక్క నాటడాన్ని ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర బాధ్యతగా మార్చే ప్రయత్నం చేశారు.
👉1,200 మొక్కలు.. 1,200 ఆశలు …
కేఎంసీ ప్రాంగణంలో నాటిన 1,200 మొక్కలు.. భవిష్యత్ తరాలకు 1,200 ఆశలు. కొన్ని సంవత్సరాల తరువాత ఒక విద్యార్థి ఆ చెట్టు నీడలో నడుస్తూ ఉండవచ్చు. ఆ చెట్టును ఎవరు నాటారో, ఎప్పుడు నాటారో అతనికి తెలియకపోవచ్చు. కానీ ఆ చెట్టు వెనుక ఒక తరం పూర్వ విద్యార్థుల ప్రేమ, బాధ్యత, భావితరాల పట్ల ఉన్న ఆలోచన మాత్రం సజీవంగా ఉంటుంది. మన కోసం చేసే పనులకు ఒక ముగింపు ఉంటుంది. కానీ ఒక చెట్టును నాటడం మాత్రం మనకు తెలియని తరాల కోసం చేసే పని. అదే ఆలోచనను కేఎంసీ ప్రాంగణంలో ఆచరణలో పెట్టారు డాక్టర్ శ్రీధర్ కస్తూరి.

ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించడం ఆయన నిర్వహణా సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది. దాదాపు 5 వేల మంది వైద్యులు సభ్యులుగా ఉన్న కేఎంసీ పూర్వ విద్యార్థుల సంఘాన్ని పర్యావరణ పరిరక్షణ వంటి సామాజిక బాధ్యత వైపు నడిపించడం ఆయన నాయకత్వానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది.
👉 భావితరాలకు పచ్చని కానుక !
కేఎంసీ పూర్వ విద్యార్థులు నాటిన ఈ మొక్కలు రేపు మహావృక్షాలుగా ఎదిగి విద్యార్థులకు నీడనివ్వవచ్చు.. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచవచ్చు.. కళాశాల ప్రాంగణానికి కొత్త అందాన్ని తీసుకురావచ్చు. అందుకే డాక్టర్ శ్రీధర్ కస్తూరి చేపట్టిన ఈ కార్యక్రమం కేవలం 1,200 మొక్కలు నాటిన కార్యక్రమం కాదు.. ఒక హరిత సంకల్పం.
👉 ఇది ఒక తరం పూర్వ విద్యార్థులు మరో తరానికి అందిస్తున్న పచ్చని కానుక !
వైద్య సేవలతో మనుషుల గుండెలను కాపాడే డాక్టర్ శ్రీధర్.. 1,200 మొక్కలతో కేఎంసీ భవిష్యత్ తరాల గుండెల్లో పచ్చదనాన్ని నాటారు. వైద్యుల చేతుల్లో ప్రాణరక్షణ మాత్రమే కాదు.. పచ్చదనం పరిరక్షణ కూడా..! అనే సందేశాన్ని చాటుతూ కాకతీయ మెడికల్ కాలేజీలో నాటిన 1200 మొక్కలు రాబోయే రోజుల్లో పచ్చని వారసత్వానికి ప్రతీకగా నిలవనున్నాయి.
