👉 జాప్యం సహించేది లేదు – అధికారులకు డెడ్‌లైన్లు !
👉 పనులు జాప్యం చేస్తే బ్లాక్‌లిస్ట్— కాంట్రాక్టర్లకు మంత్రి వార్నింగ్!
👉 రోళ్లవాగు షట్టర్‌కు ఆగస్టు నెలాఖరు..!
👉 అక్కేపల్లి లిఫ్ట్‌కు జనవరి 2027 డెడ్‌లైన్ !
👉 అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో మంత్రి లక్ష్మణ్ కుమార్ సమీక్ష!
J . SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల జాప్యంపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతి సంతృప్తికరంగా లేదని స్పష్టం చేస్తూ.. ఇకపై ప్రతి పనికి స్పష్టమైన షెడ్యూల్ రూపొందించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పనుల్లో జాప్యం చేసే కాంట్రాక్టర్లు, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని, అవసరమైతే కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్ చేయాలని మంత్రి హెచ్చరించారు.
జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో బుధవారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి వివిధ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో మంత్రి ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పెండింగ్ బిల్లులు, భూసేకరణ తదితర అంశాలపై శాఖల వారీగా వివరాలు తెలుసుకున్నారు.
👉 గడువు పెట్టండి.. ఫలితం చూపండి !
“పనులకు షెడ్యూల్ రూపొందించుకుని క్షేత్రస్థాయిలో వేగం పెంచాలి. రానున్న రోజుల్లో అభివృద్ధి పనుల్లో స్పష్టమైన మార్పు ప్రజలకు కనిపించాలి” అని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
👉 మంజూరైన పనులకు టెండర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టే రూ.5 లక్షల వరకు ఉన్న పనులను స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఆలస్యం లేకుండా ప్రారంభించాలని సూచించారు.
👉 కీలక పనులకు డెడ్‌లైన్లు !
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ధర్మపురి పట్టణంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ముందుగానే ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు.
👉 రోళ్లవాగు షట్టర్ పనులు ఆగస్టు నెలాఖరులోగా, అక్కేపల్లి లిఫ్ట్ పనులు జనవరి 2027 నాటికి పూర్తి చేయాలని డెడ్‌లైన్లు విధించారు. అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెండింగ్ బిల్లుల వివరాలను తన దృష్టికి తీసుకువస్తే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

👉 యశ్వంతరావుపేట, రంగధాంపల్లి చెరువుల అంచనాలను త్వరగా ఆమోదించి పనులు ప్రారంభించాలని, కన్నంపల్లి లింక్ కాలువకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ చెల్లింపులను పరిష్కరించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
👉 కోరండపల్లి చెరువుపై ప్రత్యేక దృష్టి !
ధర్మపురిలో ₹ 3.14 కోట్లతో చేపట్టిన కోరండపల్లి చెరువు అభివృద్ధి పనులు ప్రస్తుతం 35 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. బండ్ ఏర్పాటు, స్టోన్ పిచింగ్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పునరుద్ధరణ పనులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి జూన్ 2027 నాటికి చెరువును నీటితో నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
👉 ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణ పనులను సీజన్ ప్రారంభానికి ముందే ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అన్నారు.
👉 “ప్రతి గుడిసెకు ఇల్లు” !
అభివృద్ధి పనులతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపైనా మంత్రి ప్రత్యేకంగా సమీక్షించారు. ధర్మపురి నియోజకవర్గంలో తొలి దశలో 2,756 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. 2,462 ఇళ్లకు మార్కింగ్ పూర్తయిందని తెలిపారు. నిర్మాణంపై ఆసక్తి చూపని లబ్ధిదారులను నిరంతరం సంప్రదించి, అర్హులైన ఇతర లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు.
నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు 617 ఇళ్ల నిర్మాణాలు పూర్తికాగా, మరో 1,295 ఇళ్లు ఫినిషింగ్ దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి తెలిపారు.
👉 రెండో దశలో ధర్మపురి నియోజకవర్గాన్ని గుడిసెలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి గుడిసెకు ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలకు ఇళ్ల మంజూరులో పూర్తి పారదర్శకత పాటించాలని స్పష్టం చేశారు.
👉 పనుల్లో వేగం.. ప్రజలకు ఫలితం కనిపించాలి అన్న లక్ష్యంతో అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
