👉 ఢిల్లీ లో విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి !
👉 కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి !
J SURENDER KUMAR,
భారతదేశ గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారతరత్న పురస్కారం అందించి గౌరవించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సరళీకృత ఆర్థిక విధానాలతో పాటు, స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారతరత్న పురస్కారంతో పాటు దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వారి జ్ఞాపకార్థం సముచితమైన విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
👉 హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్‌లో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించిన మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారక పార్క్‌ను, ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
👉 ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ , సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి, ఆర్థిక మాజీ సలహాదారు మోహన్ గురుస్వామి , ఎంపీలు వేం నరేందర్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి , ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, నవీన్ యాదవ్ తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
👉 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ…….
దేశానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ అందించిన విశేషమైన సేవలను గుర్తుచేశారు. విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రత హక్కు చట్టం, ఆదివాసీ హక్కుల కోసం చట్టం, భూ సేకరణ – పునరావాస చట్టం వంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ కాలంలో తెచ్చిన విప్లవాత్మకమైన చట్టాల గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు.

👉 దేశం ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన పరిస్థితుల్లో ఆర్థిక సరళీకృత విధానాలు అమలు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీవితం, త్యాగనిరతి, జేన్-జీ, అల్ఫా, బీటా తరాలకు దేశభక్తి స్ఫూర్తిని ఇవ్వాలన్న ఉద్దేశంతో వారి విగ్రహాన్ని ఆవిష్కరించాం. దేశం గర్వించదగిన జాతిరత్నాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే విధంగా ఒక సందేశం ఇవ్వాలన్న సంకల్పంతో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
👉 ఆర్థిక సలహాదారుగా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ మన్మోహన్ సింగ్, దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా హరించుకుపోయి, ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన ముఖచిత్రం నుంచి ఆనాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు నాయకత్వంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ తన అనుభవాలను రంగరించి ఆర్థిక సరళీకృత విధానాలను ప్రవేశపెట్టారు.
👉 పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్… విధానాలను గొప్ప ఫలితాలనిచ్చాయి.

👉 హైదరాబాద్ నగరంలోని మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐఎస్‌బీ, అమెరికన్ కాన్సులేట్ వంటి దిగ్గజ సంస్థలు, దాదాపు 40 శాతానికి పైగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చుతున్న సంస్థలున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో డాక్టర్ మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని, పార్క్‌ను ఏర్పాటు చేయడం సముచితమని భావించాం.
👉 తెలంగాణ చరిత్రను రెండు భాగాలుగా చూడొచ్చు. నిజాం పాలన నుంచి హైదరాబాద్ రాష్ట్రానికి విముక్తి కలిగించడం. సమైక్య రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేయడం. ఆనాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ నేతృత్వంలో పోలీస్ యాక్షన్ ద్వారా ప్రజలకు స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని అందించారు. ఈ విషయంలో ఎప్పుడు చర్చించినా నెహ్రూ, పటేల్ గార్లను ప్రజలు స్మరించుకుంటారు.
👉 ఆ తర్వాత దశలో తెలంగాణ ప్రజలు శాశ్వతంగా కృతజ్ఞతలు తెలిపే ఘట్టం. శ్రీమతి సోనియాగాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ గార్ల నేతృత్వంలో 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ స్వప్నాన్ని శాశ్వతం చేసుకున్నాం.
👉 తెలంగాణ ఏర్పాటు చేస్తూ బిల్లుపై డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పెట్టిన సంతకాన్ని ఈ పార్క్‌లో నిక్షిప్తం చేశాం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికీ ఆయన స్వదస్తూరి సంతకం కనిపించేలా ముద్రించడం జరిగింది. ఆ గొప్పమేధావి మన్మోహన్ సింగ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వ్యక్తిగతంగా తనకు గౌరవం తెచ్చేదిగా భావిస్తున్నా.
👉 ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ తో వ్యక్తిగత పరిచయాలు, వారి ఆలోచనల పట్ల సంపూర్ణ అవగాహన ఆర్థికవేత్త మోహన్ గురుస్వామిని ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించి మాట్లాడించాం.

👉 దేశ శ్రేయస్సు కోసం ఎన్నో చట్టాలను అమలు చేసిన మౌనముని. గొప్ప రాజనీతిజ్ఞుడు, భారతదేశ ముద్దుబిడ్డ. వారికి భారతరత్న పురస్కారం ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు అభ్యంతరం ? దేశం గర్వించదగిన జాతిరత్నాన్ని రాజకీయపరమైన అంశాల నేపథ్యంలో గుర్తించకపోవడం విషాదకరం. కొన్ని సందర్భాలు, అంశాల్లో రాజకీయాల గురించిన ఆలోచన చేయడం ఎంతమాత్రం తగదు.
👉 భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి చట్టాలు, శాసనలు, రాజ్యాంగ సవరణలు చేసిన గొప్ప వ్యక్తికి, వారి స్మారకం ఢిల్లీలో ఉండాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కు భారతరత్న పురస్కారం అందించాలి. ఈ అంశాలపై తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో లేవనెత్తాలి అని ముఖ్యమంత్రి కోరారు.
