ఏసీబీకి చిక్కిన సీడీపీఓ తీరుపై ఆరోపణలు!

👉 21 అంగన్‌వాడీ కేంద్రాలకు రూ.63 వేల డిమాండ్‌ ?

👉 జూన్‌లోనే అద్దె వాహనంపై వివాదం.. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి పాత్రపై చర్చ !

👉 విదేశీ ప్రయాణ అనుమతికి ₹ 60 వేలు డిమాండ్‌ చేశారన్న ఆరోపణలు !

👉 312 కేంద్రాల పరిధిలో మరిన్ని వసూళ్లపై విచారణకు డిమాండ్‌ !


J . SURENDER KUMAR,


జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో సీడీపీఓగా పనిచేస్తున్న అధికారిణి ఏసీబీకి పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్‌ చేశారన్న ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో నిర్వహించిన ట్రాప్‌లో ఆమె పట్టు పడింది.

మెట్‌పల్లి పట్టణంలోని 21 అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి ఒక్కో కేంద్రం నుంచి ₹.3 వేల చొప్పున మొత్తం ₹.63 వేలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ కరీంనగర్‌ యూనిట్‌ ఇన్‌చార్జ్‌ డీఎస్పీ గొర్రె మధు ఆధ్వర్యంలో శనివారం జరిగిన ఈ దాడిలో లంచం మొత్తంతో సహా సీడీపీఓను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అనంతరం మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచినట్లు అధికారి తెలిపారు.

ఏ సి బి డి ఎస్ పి మధు సిడిపిఓ అవినీతిపై వివరాలు వెల్లడిస్తున్న దృశ్యం (ఫైల్ ఫోటో)

👉 జూన్‌లోనే అద్దె వాహనంపై వివాదం ?

ఇతర జిల్లా నుంచి జూన్‌లో మెట్‌పల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టుకు బదిలీపై వచ్చిన సీడీపీఓ పద్మపై అద్దె వాహనం వినియోగానికి సంబంధించి అప్పటినుంచే పలు ఆరోపణలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టుకు కేటాయించిన అద్దె వాహనాన్ని జిల్లా పరిధి దాటి ఇతర జిల్లాలకు వినియోగించారనే ఆరోపణలతో పాటు, వాహన యజమాని ఏర్పాటు చేసిన డ్రైవర్‌ కాకుండా మరో వ్యక్తి వాహనం నడిపారనే ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. డీజిల్‌ వినియోగం, లాగ్‌బుక్‌ నిర్వహణ, ఇతర జిల్లాలకు వాహనం వెళ్లేందుకు అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


👉 312 అంగన్‌వాడీ కేంద్రాలు.. 10 మంది సూపర్‌వైజర్లు!

పెట్టుపల్లి ఐసిడిఎస్ కార్యాలయం ( ఫైల్ ఫోటో)

మెట్‌పల్లి ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 312 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నట్లు సమాచారం. మెట్‌పల్లి పట్టణంలో 21, కోరుట్ల పట్టణంలో 60 కేంద్రాలతో పాటు మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి రూరల్‌, కథలాపూర్‌ ప్రాంతాల్లోనూ కేంద్రాలు కొనసాగుతున్నాయి. వీటి పర్యవేక్షణకు సుమారు 10 మంది సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

👉అయితే సూపర్‌వైజర్లతో సంబంధం లేకుండా ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలపై పర్యవేక్షణ, సమాచార సేకరణ, ఇతర వ్యవహారాలు సాగేవని ప్రాజెక్టులో చర్చ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపైనా అధికారులు సమగ్రంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

👉 విదేశీ ప్రయాణ అనుమతికి ₹ 60 వేలా ?

ప్రాజెక్టు పరిధిలోని ఓ అంగన్‌వాడీ కార్యకర్త తన కుమార్తె అమెరికాలో ఉండటంతో, ప్రసూతి సమయంలో ఆమె వద్దకు వెళ్లేందుకు అనుమతి కోరిన సందర్భంలో ₹ 60 వేలు డిమాండ్‌ చేశారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మొత్తాన్ని ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ద్వారా డిమాండ్‌ చేసినట్లు ప్రాజెక్టు వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలకు సంబంధించి వాస్తవాలు ఏంటన్నది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది.

👉 21 కేంద్రాల నుంచే ₹ 63 వేలు 312 కేంద్రాల్లో ఎంత ?

ప్రస్తుతం 21 అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించి రూ.63 వేల లంచం డిమాండ్‌ ఆరోపణలపై ఏసీబీ చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. మొత్తం 312 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఇలాంటి వ్యవహారాలు ఏమైనా జరిగాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

👉 అంగన్‌వాడీ కేంద్రాల్లో వివిధ కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో వాటి వినియోగం, ఖర్చుల నిర్వహణ, సిబ్బందిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయన్న అంశాలపైనా సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


👉సీడీపీఓతో పాటు ఆరోపణల్లో ప్రస్తావనకు వచ్చిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి పాత్ర, గతంలో వచ్చిన ఫిర్యాదులు, వాహన వినియోగం, 312 అంగన్‌వాడీ కేంద్రాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై ఏసీబీ దర్యాప్తు సాగిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.