సిరిసిల్లలో అవినీతి పార్ట్‌-1….

👉 సిద్దిపేట, గజ్వేల్‌లో పార్ట్‌-2, 3……

👉 మంత్రి లక్ష్మణ్‌కుమార్…..!

J.SURENDER KUMAR,

గత తొమ్మిదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజల ముందుంచేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభల ద్వారా వివరించనున్నారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా సిరిసిల్ల సభలో ‘అవినీతి పార్ట్‌-1’ను ప్రజల ముందుంచుతామని, త్వరలో సిద్దిపేటలో పార్ట్‌-2, గజ్వేల్‌లో పార్ట్‌-3ను వెల్లడిస్తామని చెప్పారు.

👉 బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో గొర్రెలు, మేకలకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పించిన సందర్భంగా గొర్రెల పెంపకందారుల సంఘం, అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

👉 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ గొల్లకురుమల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేస్తోందన్నారు.

👉 గతంలో ధర్మపురి నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి గొల్లకురుమల సమస్యలను వివరించామని, దీనిపై స్పందించిన సీఎం రాష్ట్రవ్యాప్తంగా గొర్రెలు, మేకలకు బీమా పథకాన్ని అమలు చేసేందుకు శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు.

👉 బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై ప్రజలకు వాస్తవాలను వివరించడమే లక్ష్యంగా సిరిసిల్ల నుంచి ప్రారంభమయ్యే సభల పరంపరలో సిద్దిపేట, గజ్వేల్‌ సభలు కూడా ఉంటాయని మంత్రి లక్ష్మణ్‌కుమార్ పేర్కొన్నారు.