విమానాశ్ర‌యాల నిర్మాణాలు తెలంగాణ ప్ర‌తీక‌లుగా ఉండాలి!

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!


J.SURENDER KUMAR,


ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్ర‌తీక‌లుగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. తెలంగాణ చ‌రిత్ర‌, సంస్కృతికి ప్ర‌తిరూపాలుగా ఉన్న కాక‌తీయ క‌ళాతోర‌ణం, రామ‌ప్ప ఆల‌యం, పిల్ల‌ల‌మ‌ర్రి దేవాల‌యం.. శిల్ప‌, వాస్తు క‌ళ‌ను ప‌రిశీలించి, అవి ప్ర‌తిబింబించేలా నిర్మాణాలు చేప‌ట్టాల‌ని సూచించారు.

👉 ఆదిలాబాద్‌, వరంగల్ విమానాశ్ర‌యాలు, ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌పై ముఖ్య‌మంత్రి  డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వ‌హించారు. ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాలు నిర్మించే ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్ర‌వాహం మార్పు, ర‌హ‌దారుల మ‌ళ్లింపు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగునీటి స‌ర‌ఫ‌రా లైన్ల మార్పు అంశాల‌ను అధికారులు ముఖ్యమంత్రి కి తెలియ‌జేశారు.

👉 ఆయా అంశాల‌పై పూర్తి వివ‌రాలు తెలుసుకున్న ముఖ్య‌మంత్రి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. విమానాశ్ర‌యాల కాంపౌండ్ వాల్ స‌మీపం నుంచి ర‌హ‌దారులు నిర్మించాల‌ని, ఆ ర‌హ‌దారుల‌ను స‌మీప జిల్లా, రాష్ట్ర, జాతీయ ర‌హ‌దారుల‌కు అనుసంధానం చేయాల‌ని సూచించారు.

👉 ఏ శాఖ‌కు ఆ శాఖ విడివిడిగా ప‌నులు చేప‌డితే, అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. విద్యుత్‌, ఆర్ అండ్ బీ, తాగునీటి స‌ర‌ఫ‌రా, నీటి పారుద‌ల శాఖ అధికారులు స‌మావేశ‌మై బీఎస్ఎన్ఎల్ అధికారుల‌తో చ‌ర్చించి, ఏక‌కాలంలో ప‌నులు సాగేలా చూడాల‌ని సూచించారు.

👉 ప్రస్తుత అవ‌స‌రాల‌నే కాకుండా భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించుకొని ప‌నులు ముందుకు సాగేలా చూడాల‌ని సూచించారు. వాగులు, ఇత‌ర నీటి ప్ర‌వాహాల‌ను మ‌ళ్లించాల్సి వ‌స్తే, విమానాశ్ర‌యాల ప్రాంగణం లేదా స‌మీపంలో చెరువుల‌ను నిర్మించి, అక్క‌డి నుంచి ప్ర‌వాహాల‌ను మ‌ళ్లించేలా చూడాల‌ని చెప్పారు.

👉 విమానాశ్ర‌యాల‌కు వ‌చ్చే, వెళ్లే ర‌హ‌దారులు విశాలంగా ఉండ‌డంతో పాటు స‌మీపంలోని ముఖ్య ర‌హ‌దారుల‌కు అనుసంధానించేలా ఉండాలని, నిర్దేశిత స‌మ‌యంలో ప‌నులు పూర్తి చేయాలని ఆదేశించారు.

👉 ఆదిలాబాద్‌, వ‌రంగ‌ల్ విమానాశ్ర‌యాల‌తో పాటు ఢిల్లీ తెలంగాణ భ‌వ‌న్ నిర్మాణాల‌కు సంబంధించిన డిజైన్ల‌ను ముఖ్య‌మంత్రి  సమావేశంలో ప‌రిశీలించారు. ప్ర‌తి నిర్మాణంలోనూ తెలంగాణ సంస్కృతి, శిల్ప‌, వాస్తు క‌ళ‌ల‌కు పెద్ద‌పీట వేయాల‌ని ఆదేశించారు. ప‌లు ఆకృతులకు సంబంధించి ముఖ్యమంత్రి  మార్పుల‌ను సూచించారు.

👉 ఈ సమావేశంలో మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి , ఎంపీలు వేం నరేంద‌ర్ రెడ్డి  చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి , విప్ బీర్ల ఐల‌య్య‌ , రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజు తో పాటు సంబంధిత ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.