👉ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై సమావేశం !
👉 బాధితులకు సత్వర న్యాయం.. పరిహారం గ్రీన్ ఛానెల్‌లో విడుదల చేయాలి !
👉 ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…!
J . SURENDER KUMAR
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం అమలుపై తెలంగాణలో 13 ఏళ్ల తర్వాత తొలిసారిగా రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో చట్టం అమలు, కేసుల దర్యాప్తు, విచారణ, బాధితులకు పరిహారం, పునరావాసం తదితర అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు.
👉 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి సమావేశం జరగగా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి సమావేశం జరగడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
👉 రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులు క్రమంగా తగ్గుతున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. అయితే కొన్ని జిల్లాల్లోని 73 గ్రామాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.

👉 అట్రాసిటీ ఘటనల్లో బాధితులకు సకాలంలో పరిహారం, సహాయం, పునరావాసం అందేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. పరిహారం విడుదలను బడ్జెట్ కోసం వేచి చూడకుండా గ్రీన్ ఛానెల్‌లో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. షాబాద్ హత్యల కేసు, తుక్కుగూడలో నర్సుపై హత్యాచారం కేసులను ప్రస్తావించిన సీఎం.. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించాలని సూచించారు.
👉 చదువుతోనే శాశ్వత మార్పు..!
దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. సంక్షేమ పథకాలతో పాటు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లలను చదువు, క్రీడల వైపు ప్రోత్సహించాలని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎస్సీ కమిషన్ ప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
