వినాయకులకు మంత్రి అడ్లూరి ఘన స్వాగతం !

👉ప్రజలు సుఖశాంతులతో ఉండాలి సమృద్ధిగా వర్షాలు కురవాలి!


👉 గోదావరిలో నిమజ్జనానికి తరలిన గణనాథులకు స్వాగతం!


J.SURENDER KUMAR,

గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ధర్మపురి పట్టణంలో కొలువుదీరిన గణనాథులు శుక్రవారం రాత్రి గోదావరి నదిలో నిమజ్జనానికి తరలి వెళ్లాయి. మంగళ వాయిద్యాల నడుమ సాగిన వినాయకుల శోభాయాత్రకు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేకంగా హాజరై వినాయక విగ్రహాలకు ఘన స్వాగతం పలికారు.

👉 పట్టణంలోని నంది విగ్రహం వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  వినాయక విగ్రహాల వాహనాలకు కొబ్బరికాయలు కొట్టి, పూలు చల్లి భక్తిశ్రద్ధలతో స్వాగతించారు.

చైర్‌పర్సన్ శ్రీమతి వేముల నాగలక్ష్మి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంఘనపట్ల దినేష్ తదితరులు మంత్రితో కలిసి వినాయక విగ్రహాలకు స్వాగతం పలికారు.


👉 అలాగే స్థానిక ఇసుక స్తంభం వద్ద విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్ద కూడా వినాయక విగ్రహాలకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.


👉 నిమజ్జనానికి ముందు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పట్టణంలోని పలు వినాయక మండపాలను సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని గణనాథుడిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు.


👉 గోదావరి నది వద్ద నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గజ ఈతగాళ్లు, క్రేన్‌లు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ధర్మపురిలో నిమజ్జన శోభాయాత్ర భక్తి, భక్తుల సందడి, డప్పు వాయిద్యాలు, తీన్మార్ స్టెప్పులు, చిన్నారులతో  నృత్య ప్రదర్శనలకార్యక్రమాలు, భక్తిగీతాలతో ఉత్సాహంగా సాగింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శోభాయాత్రలో పాల్గొని భక్తులను పలకరించారు.