👉 ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసిన మొక్కలు నాటకుండానే ఎండిపోయాయా..?
👉 గుంతలు సిద్ధం.. మొక్కలు మాయం.!
J.SURENDER KUMAR,
వన సంరక్షణ కోసం ప్రభుత్వ నిధులతో వేలాది మొక్కలు కొనుగోలు చేసి.. వాటిని నాటేందుకు గుంతలు తీసి.. చివరకు మొక్కలను సంరక్షించకుండా ఎండిపోవడానికి వదిలేశారన్న ఆరోపణలు జగిత్యాల జిల్లా ధర్మపురి అటవీశాఖ రేంజ్ పరిధిలో చర్చనీయాంశంగా మారాయి. బీర్పూర్ మండలం కొల్వాయి అటవీ పరిధిలోని అరగుండాల, బుగ్గచెరువు దారి సమీపంలో నాటేందుకు సిద్ధం చేసిన మొక్కలు ఎండిపోయి కనిపించడంతో ప్రభుత్వ నిధుల వినియోగం, వన సంరక్షణ కార్యక్రమాల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మొక్కలు నాటేందుకు తీసిన గుంతలు మట్టితో పూడుకుపోవడం, మొక్కలు ఉంచిన ప్రాంతంలో వాటి ప్లాస్టిక్ బ్యాగుల అవశేషాలు మాత్రమే మిగిలి ఉండటం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతున్నాయని స్థానికులు, ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు. వేలాది మొక్కలను కొనుగోలు చేసినప్పుడు వాటి సంరక్షణ, నాటడం, తదుపరి నిర్వహణకు సంబంధించిన చర్యలు ఎందుకు పూర్తికాలేదన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
👉 వనమహోత్సవ లక్ష్యాలకు విరుద్ధంగా..

తెలంగాణ ప్రభుత్వం వనమహోత్సవం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున మొక్కలు నాటి అటవీ సాంద్రతను పెంచే లక్ష్యంతో కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాల వారీగా అటవీ ప్రాంతాలతో పాటు ఖాళీ ప్రదేశాలను గుర్తించి మొక్కలు నాటేందుకు కార్యాచరణ చేపట్టినట్లు అధికారికంగా పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన మొక్కలు నాటకుండానే ఎండిపోతే, వన సంరక్షణ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
జగిత్యాల జిల్లా పరిధిలోని ధర్మపురి, జగిత్యాల, కొడిమ్యాల, రాయికల్, మెట్‌పల్లి టెరిటోరియల్ ఫారెస్ట్ రేంజ్‌లలో ప్లాంటేషన్ కార్యక్రమాలు చేపట్టినట్లు సంబంధిత నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే క్షేత్రస్థాయిలో చేపట్టిన పనులకు, రికార్డుల్లో నమోదైన వివరాలకు మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా అన్నది స్వతంత్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.
👉 రికార్డుల్లో మొక్కలు.. క్షేత్రస్థాయిలో ఎక్కడ ?

జిల్లాకు ప్రభుత్వం ఎన్ని మొక్కలు కేటాయించింది..? వాటిలో ఎన్ని మొక్కలు కొనుగోలు చేశారు..? ఎన్ని నాటారు..? ఎన్ని మొక్కలు బతికి ఉన్నాయి..? అనే వివరాలను రేంజ్, సెక్షన్ వారీగా బహిర్గతం చేయాలని పలువురు కోరుతున్నారు. సంబంధిత రికార్డులు, ప్లాంటేషన్ ప్రాంతాలను విజిలెన్స్ లేదా ఉన్నతాధికారుల బృందంతో క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తే వాస్తవ పరిస్థితులు వెలుగులోకి వస్తాయని ప్రకృతి ప్రేమికులు పేర్కొంటున్నారు.
మరోవైపు, ఇటీవలే జగిత్యాలలో పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా మహిళలు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు మొక్కలను పంపిణీ చేసిన కార్యక్రమాలు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేసిన మొక్కలు సంరక్షణ లేక ఎండిపోతున్నాయన్న ఆరోపణలు రావడం విరుద్ధ పరిస్థితులకు అద్దం పడుతోంది.

ప్రభుత్వ లక్ష్యం పచ్చదనం పెంచడం అయితే.. కొనుగోలు చేసిన ప్రతి మొక్క నేలలో నాటబడిందా? నాటిన ప్రతి మొక్కను సంరక్షించారా? వాటి మనుగడపై పర్యవేక్షణ జరిగిందా? అన్న ప్రశ్నలకు సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొల్వాయి అటవీ ప్రాంతంలో కనిపిస్తున్న ఎండిన మొక్కలపై ఉన్నతాధికారులు విచారణ జరిపి, ప్రభుత్వ నిధుల వినియోగం మరియు ప్లాంటేషన్ పనుల వాస్తవ స్థితిని తేల్చాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
