45 ఎకరాల భూముల ఆచూకీ ఎక్కడ.?

👉 కేసీఆర్, కుటుంబ సభ్యులకు నోటీసులు జారీకి అధికారుల నిర్ణయం !


J.SURENDER KUMAR,

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో రికార్డుల్లో ఉన్న భూమికి, క్షేత్రస్థాయిలో గుర్తించిన భూమికి మధ్య భారీ వ్యత్యాసం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. సర్వే నంబర్‌ 325లో రికార్డుల ప్రకారం 388 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా.. తాజా సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 45 ఎకరాల భూముల ఆచూకీపై స్పష్టత కోసం సమగ్ర సర్వేకు ప్రభుత్వం ఆదేశించింది.


ఈ నేపథ్యంలో సర్వే నంబర్‌ 325 సమీపంలో మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్), ఆయన కుటుంబ సభ్యులకు భూములు ఉన్నందున, ఆయా భూములకు సంబంధించిన రికార్డులను సమర్పించాలని కోరుతూ వారికి నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఈ నోటీసులు జారీ అనంతరం సమర్పించే రికార్డులు, క్షేత్రస్థాయి సర్వే వివరాల ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.

👉 45 ఎకరాల తేడాపై ప్రత్యేక దృష్టి..!

22-ఏ భూముల వ్యవహారంపై గత నెల 16న శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. దీనిపై జరుగుతున్న దర్యాప్తు పురోగతిపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో నిర్వహించిన సమీక్షలో అధికారులు వివరాలు వెల్లడించారు.

రికార్డుల్లో 388 ఎకరాలుగా నమోదై ఉన్న సర్వే నంబర్‌ 325లో క్షేత్రస్థాయిలో 343 ఎకరాలు మాత్రమే గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రికార్డులకు, వాస్తవ భూమికి మధ్య 45 ఎకరాల వ్యత్యాసం ఎలా ఏర్పడిందనే అంశమే ఇప్పుడు విచారణలో కీలకంగా మారింది.

👉 అర్హులైన రైతులకు భూముల పంపిణీ…!

సర్వే అనంతరం గుర్తించే భూమిని స్థానికంగా అర్హులైన రైతులకు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అదే సమయంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, అన్ని మౌలిక వసతులతో ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ ఏర్పాటు చేయాలని సూచించారు.

వచ్చే జూన్ 2లోగా అమరవీరుల కాలనీ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, నిర్మాణ బాధ్యతలను గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలని ఆదేశించారు.

👉 ఎడ్యుకేషన్ హబ్‌కు ప్రణాళిక….!

కొండపాక మండలం వెలికట్ట గ్రామ పరిధిలో అసైన్డ్ భూములు, మిషన్ భగీరథ భూములను మినహాయించి మిగిలిన భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ (YIIRS), ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా ముఖ్యమంత్రి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

👉 మల్లన్న సాగర్ నీటి వినియోగంపైనా నిఘా..!

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రిజర్వాయర్లు, చెరువుల్లోని నీటిని జాగ్రత్తగా వినియోగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. మల్లన్న సాగర్ నీటిని అనధికారికంగా వినియోగిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, భూ అక్రమాలపై ఏర్పాటు చేసిన కమిటీ, ధరణి అక్రమాలపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 45 ఎకరాల భూముల వ్యత్యాసానికి సంబంధించి చేపట్టనున్న సర్వే, కేసీఆర్ కుటుంబానికి జారీ చేయనున్న నోటీసులతో ఈ వ్యవహారం మరింత కీలక దశకు చేరింది.