👉 యూనిఫార్ములు, షూస్, పుస్తకాలు సకాలంలో అందాలి !
👉 విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ !
👉 క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో రాజీ వద్దు !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..!
J.SURENDER KUMAR,
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాలు, సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలతో పాటు మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు అందాల్సిన యూనిఫార్ములు, షూస్, పుస్తకాలు తదితర సామగ్రి ఆలస్యం కాకుండా సకాలంలో అందించాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రత, వసతి, పారిశుద్ధ్యం విషయంలో క్వాలిటీ, క్వాంటిటీకి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో శనివారం గురుకులాలు, వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో పీఎంయూ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలపై మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాలకు చేరిన యూనిఫార్ములు, షూస్, పుస్తకాలు తదితర సామగ్రిని విద్యార్థులకు వెంటనే అందించాలని సూచించారు. సరఫరా ఎక్కడ నిలిచిపోయింది, ప్రొక్యూర్‌మెంట్‌లో సమస్యలు ఏమున్నాయనే అంశాలను గుర్తించి జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశించారు.
👉 పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి…!

వందలాది మంది విద్యార్థులు ఉండే పెద్ద క్యాంపస్‌లలో ప్రస్తుతం ఉన్న పారిశుద్ధ్య సిబ్బంది సరిపోతున్నారా అనే అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. అవసరమైన చోట్ల అదనపు సిబ్బందిని వినియోగించడంతో పాటు, పారిశుద్ధ్య సేవలను సమర్థంగా నిర్వహించేందుకు తగిన విధానం రూపొందించాలని ఆదేశించారు. అవసరమైతే పారదర్శక ఆన్‌లైన్ టెండర్ విధానాన్ని పరిశీలించాలని, పారిశుద్ధ్య సిబ్బందికి తక్కువగా ఉన్న వేతనాలను పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
👉 భద్రతకు ప్రాధాన్యం…!
గురుకుల విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. అవసరమైన చోట్ల భద్రతా సిబ్బంది, పోలీసు సమన్వయం, సీసీ కెమెరాల ఏర్పాటుపై సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు. ముఖ్యంగా బాలికల గురుకులాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లతో అనుసంధానం చేసే చర్యలు చేపట్టాలని సూచించారు.
👉 వసతులపై సమగ్ర ప్రణాళిక….!
గురుకులాలను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దేందుకు విద్యార్థుల సంఖ్య, స్థానిక అవసరాలకు అనుగుణంగా సమగ్ర మౌలిక వసతుల ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఆదేశించారు. తరగతి గదులు, వంటశాలలు, తాగునీరు, ఆర్‌ఓ ప్లాంట్లు, వాషింగ్ సదుపాయాలు, శానిటేషన్, అవసరమైన పరికరాలను ఒకే ప్రణాళికలో చేర్చాలని సూచించారు. ఇప్పటికే అమలులో ఉన్న మంచి ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ నమూనాలను పరిశీలించి, అనువైన వాటిని ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలని తెలిపారు.
👉 ఇంటర్ విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్…!
గురుకులాల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు బోధనా విధానంలో ఏకరూపత తీసుకురావాలని మంత్రి సూచించారు. మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులకు సబ్జెక్టు నిపుణుల సేవలు అందేలా ఆన్‌లైన్ తరగతులు, రిమోట్ అకడమిక్ సపోర్ట్, ఫౌండేషన్ కోర్సులను విస్తరించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని సబ్జెక్టు నిపుణుల సేవలను జిల్లాల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేలా వర్చువల్ తరగతులు నిర్వహించాలని సూచించారు.
ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్, డిజిటల్ లెర్నింగ్ వనరులు, అదనపు కోచింగ్ అందించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి ఆదేశించారు. పోటీ పరీక్షలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు సరైన మార్గదర్శనం అందించాలని సూచించారు.
👉 ప్రతి సమస్యకు గడువు.. బాధ్యత..!
గురుకులాల్లో సాంక్షన్ అయిన పోస్టులు, పనిచేస్తున్న సిబ్బంది, ఖాళీల వివరాలను సమగ్రంగా పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. నియామకాల విషయంలో పోస్టుల మంజూరు, రోస్టర్, సీనియారిటీ, నియామక విధానం, ఆర్థిక శాఖ అనుమతుల అంశాలను ధ్రువీకరించాలని సూచించారు. గురుకులాలు, విద్యా సంస్థలకు సంబంధించిన భవనాల అద్దెలపై జీఎస్టీ వర్తింపు అంశాన్ని కూడా సమావేశంలో సమీక్షించారు. అద్దె రేటు, జీఎస్టీ తదితర అంశాలను ఒప్పందాల్లో స్పష్టంగా పేర్కొనాలని నిర్ణయించారు.
👉 విద్యార్థులకు అందాల్సిన ప్రతి వస్తువు నిర్దిష్ట గడువులోగా అందేలా ఒక అధికారికి బాధ్యత అప్పగించి, నిర్ణీత సమయంలో పంపిణీ పూర్తయ్యేలా చూడాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యం, భద్రత, వసతి, పారిశుద్ధ్యం, మౌలిక వసతులకు సంబంధించిన ప్రతి సమస్యకు బాధ్యులైన అధికారిని, గడువును నిర్దేశించి ఫలితాలు సాధించాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్య సాచి ఘోష్, ఎస్‌సీడీడీ కార్యదర్శి విజయేంద్ర బోయి, ఎస్సీ గురుకులాల కార్యదర్శి రవి గుగులోతు, ఎస్టీ గురుకులాల కార్యదర్శి సీతాలక్ష్మి, ఆశ్రమ పాఠశాలల డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
