పర్వతారోహణం లో గురుకుల విద్యార్థి రికార్డ్ !

👉 హిమాచల్ ప్రదేశ్ లోని 6,027 మీటర్ల ఎత్తైన మౌంట్‌ అవలీలగా అధిరోహించిన విద్యార్థి ఇస్లావత్‌ బన్నీ !

👉 పర్వతారోహణం లో రికార్డు సృష్టించిన గురుకుల విద్యార్థి !

👉 విద్యార్థిని అభినందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ !


J.SURENDER KUMAR,

సంకల్పం,  క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఎంతటి ఎత్తయిన లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని తెలంగాణ గిరిజన గురుకుల విద్యార్థి ఇస్లావత్‌ బన్నీ నిరూపించారు.హిమాచల్‌ప్రదేశ్‌లోని 6,027 మీటర్ల (19,774 అడుగుల) ఎత్తైన మౌంట్‌ తరంగ్‌-2 శిఖరాన్ని అధిరోహించి చారిత్రక రికార్డును సృష్టించాడు.

తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల (TGTWRDC), కామారెడ్డిలో బీకాం చివరి సంవత్సరం చదువుతున్న బన్నీ ఈ నెల 22న  పర్వతాన్ని అధిరోహించారు. సెప్టెంబరు 30న తిరిగి తిరిగి సురక్షితంగా వచ్చారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో శనివారం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ..బన్నీని శాలువాతో సత్కరించి అభినందించారు. విద్యార్థి సాధించిన ఘనతను మంత్రి ప్రశంసించారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..

“బన్నీ సాధించిన విజయం ఒక్క విద్యార్థి విజయమే కాదు.. తెలంగాణలోని ప్రతి గురుకుల విద్యార్థికి స్ఫూర్తినిచ్చే ఘనత. చదువుతో పాటు క్రీడలు, సాహస క్రీడలు, ఇతర రంగాల్లోనూ విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవాలి. లక్ష్యం ఎంత ఎత్తులో ఉన్నా దాన్ని చేరుకోవాలనే పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధన ఉంటే విజయాన్ని సాధించవచ్చు” అని అన్నారు.

👉 “ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగడమే నిజమైన క్రీడాస్ఫూర్తి. గెలుపు మాత్రమే కాదు.. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వాన్ని కూడా క్రీడలు, సాహస కార్యక్రమాలు పెంపొందిస్తాయి. బన్నీ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరింత మంది గురుకుల విద్యార్థులు క్రీడలు, సాహస రంగాల్లో ముందుకు రావాలి” అని మంత్రి ఆకాంక్షించారు.

👉 గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం, గురుకుల సంస్థలు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తాయని మంత్రి తెలిపారు. “మన విద్యార్థులు చదువులోనే కాదు.. క్రీడలు, సాహస కార్యక్రమాలు, పరిశోధన, కళలు తదితర అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకునేలా అవకాశాలు కల్పించాలి. ఒక విద్యార్థి విజయం మరెంతో మంది విద్యార్థులకు దారిచూపాలి” అని పేర్కొన్నారు.

👉 తొలి భారతీయ బృందంలో భాగస్వామ్యం…!


మౌంట్‌ తరంగ్‌-2 శిఖరం సముద్రమట్టానికి 6,027 మీటర్ల ఎత్తులో ఉంది. అత్యంత క్లిష్టమైన పర్వతారోహణలో పాల్గొన్న భారతీయ బృందంలో బన్నీ భాగస్వామిగా నిలిచారు. సెప్టెంబరు 22న శిఖరాన్ని అధిరోహించి భారతీయ పర్వతారోహణ రంగంలో తనదైన ముద్ర వేశారు.

👉 TGTWREIS సొసైటీ కార్యదర్శి శ్రీమతి కె. సీతాలక్ష్మి బన్నీని అభినందిస్తూ.. మౌంట్‌ తరంగ్‌-2ను అధిరోహించిన తొలి భారతీయ బృందంలో బన్నీ భాగస్వామిగా నిలవడం గిరిజన గురుకుల సొసైటీకి గర్వకారణమన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా, సాహస ప్రతిభను వెలికితీసేందుకు సొసైటీ నుంచి అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందిస్తామని తెలిపారు.

👉 బన్నీ విజయంపై అధికారులు, కళాశాల సిబ్బంది, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సాహస స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా TGTWREIS అదనపు కార్యదర్శి నటరాజ్, జాయింట్‌ సెక్రటరీ డి.ఎస్‌. వెంకన్న, డిప్యూటీ సెక్రటరీలు వేణుగోపాల్‌రావు, సూర్యప్రకాశ్‌రెడ్డి, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ రవి కుమార్ తదితరులు బన్నీని అభినందించారు.