👉 ఉక్రెయిన్ యుద్ధంలో మృతి చెందిన సుదర్శన్ కుటుంబానికి ₹ 6 లక్షల సాయం..!
👉 మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు..!
👉 బాధిత కుటుంబానికి అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం..!
J. SURENDER KUMAR ,
విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోయిన భర్త మృతదేహం కోసం ఎదురుచూస్తున్న భార్య.. కన్నకొడుకును కడసారి చూసుకోవాలన్న ఆవేదనలో ఉన్న తల్లి.. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చేతిలో చిల్లిగవ్వలేని ఆర్థిక పరిస్థితి! ఈ విషాద పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. మంత్రి చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి ₹ 6 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
సుదర్శన్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో తీవ్ర విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి ప్రభుత్వ నిర్ణయం కొంత ఊరటనిచ్చింది.
👉 ఉపాధి కోసం వెళ్లి ఉక్రెయిన్ యుద్ధంలో మృత్యువాత !
జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ ఉపాధి కోసం నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్‌కు వెళ్లాడు. అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో క్షిపణులు, డ్రోన్ దాడుల కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబానికి సమాచారం అందింది. సెప్టెంబర్ 1న సుదర్శన్ మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఒకవైపు కుటుంబ సభ్యుడిని కోల్పోయిన బాధ.. మరోవైపు ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఎదురైన ఆర్థిక సమస్యలు ఆ కుటుంబాన్ని మరింత కుంగదీశాయి. మృతదేహం తరలింపునకు సుమారు రూ.6 లక్షలు ఖర్చవుతుందని ఉక్రెయిన్ ఎంబసీ సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతిమ సంస్కారాల కోసం కూడా ప్రభుత్వ సహాయం కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
👉 ప్రవాసీ ప్రజావాణిలో మంత్రి దృష్టికి సమస్య !

☝️మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రి లక్ష్మణ్ కుమార్ (ఫైల్ ఫోటో)
తమకు ఎదురైన ఆపద నుంచి గట్టెక్కించాలని కోరుతూ సుదర్శన్ భార్య భార్గవి, తల్లి గంగు, హస్నాబాద్ గ్రామ సర్పంచ్ బత్తుల గంగాధర్‌తో కలిసి ప్రభుత్వ ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. తమ కుటుంబ పరిస్థితిని వివరించి, సుదర్శన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యం దృష్టికి బాధిత కుటుంబం తమ సమస్యను తీసుకెళ్లింది. కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి అడ్లూరి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
👉 మంత్రి చొరవతో సీఎం స్పందన ₹ 6 లక్షల ఆర్థిక సాయం!

బాధిత కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఉక్రెయిన్ యుద్ధంలో సుదర్శన్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
👉 సుదర్శన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి ₹ 6 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు !

☝️బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం పై సీఎం ఓ కార్యాలయా లేఖ ( ఫైల్ ఫోటో)
సీఎం ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి ఈ మొత్తాన్ని అందించేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. సుదర్శన్ భౌతికకాయాన్ని స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించారు.
👉 అంతిమ వీడ్కోలుకు మార్గం సుగమం…!
కన్నకొడుకును కోల్పోయిన తల్లి, భర్తను కడసారి చూసుకోవాలనుకుంటున్న భార్యకు ఇప్పుడు ప్రభుత్వ సహాయంపై ఆశలు చిగురించాయి. విదేశీ గడ్డపై మరణించిన తమ కుటుంబ సభ్యుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చి, సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించుకోవాలన్నది వారి ఆకాంక్ష. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆర్థిక సహాయం బాధిత కుటుంబానికి ఊరటనిచ్చే పరిణామం.

ఇక మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ త్వరగా పూర్తయితే, ఆ కుటుంబం తమ ప్రియమైన వ్యక్తికి స్వగ్రామంలో అంతిమ వీడ్కోలు పలికే అవకాశం కలుగుతుంది. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లే వారి భద్రత, ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయినప్పుడు వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకురావడంలో ప్రభుత్వ సహకారం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
