మతం వేరు – మనసు ఒక్కటే.!

👉 మతసామరస్యానికి ప్రత్యక్ష సాక్ష్యం ధర్మపురి క్షేత్రం !

👉  పక్కపక్కనే ఆలయం.. మసీదు. !

👉 పరస్పర ప్రార్థనలకు గౌరవం.. ఇదే ధర్మపురి ప్రత్యేకత !

👉  స్వామి వారిని దర్శించుకున్న జీయర్ స్వామి, ముస్లిం దంపతుల !


J.SURENDER KUMAR,


మతాల పేరుతో సమాజంలో విభేదాలు, విద్వేషాలు చెలరేగుతున్న తరుణంలో.. భిన్న మతాల మధ్య సోదరభావం, పరస్పర గౌరవానికి ధర్మపురి క్షేత్రం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. భక్తి మార్గాలు వేరైనా.. మానవత్వం ఒక్కటేనని చాటి చెబుతున్న ధర్మపురి ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా మతసామరస్యానికి కూడా ప్రతీకగా నిలుస్తోంది.

మందిరం మసీదు పక్కపక్కనే (ఫైల్ ఫోటో)

ధర్మపురిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మసీదు పక్కపక్కనే ఉండటం ఇక్కడి మతసామరస్యానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇరు మతాల ప్రార్థనా కార్యక్రమాలు జరిగే సమయంలో పరస్పరం గౌరవించుకుంటూ మైకులను నిలిపివేయడం ఇక్కడి ప్రజల మధ్య ఉన్న సోదరభావానికి అద్దం పడుతోంది. మతం వేరైనా.. మనసులు ఒక్కటేననే సందేశాన్ని ధర్మపురి సమాజానికి అందిస్తోంది.

👉 ఒకే రోజు.. రెండు స్ఫూర్తిదాయక దృశ్యాలు..!

స్వామివారిని దర్శించుకుని తులసి అర్చన ప్రత్యేక పూజలు చేయించుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన ముస్లిం దంపతులు (ఫైల్ ఫోటో)

ఆదివారం ఈ మతసామరస్య భావనకు మరింత బలం చేకూర్చే సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామానికి చెందిన ఎస్‌కే మల్సూర్–హలీమ ముస్లిం దంపతులు శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. తులసి అర్చన నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీర్థప్రసాదాలు పొందారు. రానున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, మొక్కుల గురించి తెలుసుకున్నారు.

స్వామి వారి దర్శనంకు ధర్మపురికి వచ్చిన జీయర్ స్వామికి పూర్ణకుంభ స్వాగతం (ఫైల్ ఫోటో)

ఇదే రోజున తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరు శ్రీ శఠగోప సిద్ధాంత పీఠానికి చెందిన శ్రీ శ్రీ శ్రీ శఠకోపముని రామానుజ జీయర్ స్వామి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన సాంప్రదాయం ప్రకారం జీయర్ స్వామికి పూర్ణకుంభంతో మేళతాళాల మధ్య ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి దర్శనం చేయించి, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు.

👉 మతం మనిషిని….!

మతం మనిషిని విడదీయడానికి కాదు.. మనిషిలోని మంచితనాన్ని పెంచడానికి అనే సందేశాన్ని ధర్మపురి తన ఆచరణ ద్వారా చాటుతోంది. భిన్న విశ్వాసాలను గౌరవించుకుంటూ, ఒకరి ఆచారాలను మరొకరు గౌరవించే సంస్కృతి కొనసాగితేనే సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తాయి. ఈ విషయంలో ధర్మపురి క్షేత్రం నేటి సమాజానికి స్ఫూర్తి పాఠంగా నిలుస్తోంది.

ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, ఓంకార శర్మ, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్యులు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.