మృతదేహం కోసం ఎదురుచూపులు!

👉 బాధిత కుటుంబానికి మంత్రి అడ్లూరి  భరోసా !


J.SURENDER KUMAR,


కన్న కొడుకును కోల్పోయిన తల్లి.. జీవిత భాగస్వామిని తిరిగి చూడలేని దుఃఖంలో భార్య.. అంతులేని ఆవేదన మధ్య మృతదేహం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం! ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ కుటుంబం ఎదుర్కొంటున్న ఈ విషాద పరిస్థితి హృదయాలను కలచివేస్తోంది. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ సెప్టెంబర్ 1న ఉక్రెయిన్ యుద్ధంలో మృతి చెందాడు. ఆయన మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే, మరణించిన వ్యక్తి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సుమారు ₹ 6 లక్షలు చెల్లించాలని ఉక్రెయిన్ ఎంబసీ సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో సుదర్శన్ భార్య భార్గవి, తల్లి గంగు, హస్నాబాద్ గ్రామ సర్పంచ్ బత్తుల గంగాధర్‌తో కలిసి శుక్రవారం ప్రభుత్వ ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించారు. తమ కుటుంబానికి ఎదురైన కష్టాన్ని వివరించి, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వ సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

👉 సీఎంఓ అధికారులతో మాట్లాడి ఆదుకుంటాం.!

ప్రవాసీ ప్రజావాణిని సందర్శించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యం సీఎం ప్రజావాణి కార్యక్రమం అమలవుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.


కుటుంబం ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందిస్తూ, సీఎం కార్యాలయ అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వపరంగా సహాయం అందించే అంశంపై చర్యలు చేపడతామని భరోసా కల్పించారు.

👉 కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయం..!

విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోయిన తమ కుటుంబ సభ్యుడి మృతదేహాన్ని చివరిసారిగా చూసి, స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించాలన్నది ఆ కుటుంబం ఆకాంక్ష. అయితే, మృతదేహం తరలింపునకు అవసరమైన ఖర్చు కుటుంబానికి భారంగా మారడంతో ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇలాంటి విషాద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అవసరమైన సహకారం అందించడం అత్యంత మానవీయమైన బాధ్యత. మంత్రి ఇచ్చిన హామీతో తమకు సహాయం అందుతుందనే ఆశతో కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.


ఈ కార్యక్రమంలో సీఎం ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి కె. విద్యాసాగర్, ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, కమిటీ సభ్యులు చెన్నమనేని శ్రీనివాసరావు, స్వదేశ్ పరికిపండ్ల తదితరులు పాల్గొన్నారు.