విద్యార్థుల మనసు గెలిచిన మంత్రి అడ్లూరి..!

👉 సమ్మెపై స్పందన అధికార యంత్రాంగాన్ని కదిలించిన మంత్రి జోక్యం !

👉 మంత్రి చొరవతోనే అధికారులు మా వద్దకు వచ్చారు.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.!

👉 మెడికో విద్యార్థి నాయకుడు బెనర్జీ..!

J.SURENDER KUMAR,

సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కిన విద్యార్థుల వద్దకు అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చేలా చొరవ చూపడం.. సమ్మె చేస్తున్న విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇప్పించడం.. ఇచ్చిన మాటకు అనుగుణంగా సంబంధిత మంత్రితో మాట్లాడించడం.. జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల విషయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించిన తీరు ఇప్పుడు మెడికోల ప్రశంసలు అందుకుంటోంది. తమ సమస్యలపై మంత్రి చూపిన చొరవకు ముగ్ధులైన విద్యార్థులు, ఆయనకు బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు.

👉 విద్యార్థుల ఆందోళనపై తక్షణ స్పందన….!

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో పాటు, హాస్టల్, కిచెన్, బస్సు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవడంపై వైద్య విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం సమ్మెకు దిగారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చిన విద్యార్థుల పరిస్థితిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు.

హైదరాబాద్‌లో ఉన్న మంత్రి నేరుగా విద్యార్థి సంఘం నాయకుడు బెనర్జీకి ఫోన్ చేసి మాట్లాడారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులు విద్యార్థుల వద్దకు వచ్చి సమస్యలను పరిశీలిస్తారని, సమ్మె విరమించాలని అభ్యర్థించారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రితోనూ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

👉 సంబంధిత మంత్రితో మాట్లాడించిన అడ్లూరి..!

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అందుబాటులో లేకపోవడంతో, వైద్య కళాశాల భవన నిర్మాణానికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విద్యార్థులు మాట్లాడేలా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవ తీసుకున్నారు. ఈ సందర్భంగా డిసెంబర్ 15 నాటికి కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు.

మరోవైపు, వైద్య విద్యాశాఖ ఉన్నతాధికారులు, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం, మంత్రుల నుంచి వచ్చిన హామీలను వివరించి సమ్మె విరమించాలని కోరారు..

👉 “మంత్రి ఫోన్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు !”

మంత్రి స్పందనపై మెడికో విద్యార్థి సంఘం నాయకుడు బెనర్జీ చేసిన వ్యాఖ్యలు విద్యార్థుల మనోభావాలను ప్రతిబింబించాయి. ఒక మంత్రి స్వయంగా ఫోన్ చేసి తమ సమస్యలను అడిగి తెలుసుకోవడం, సంబంధిత మంత్రితో మాట్లాడించడం, మెడికో ల సమ్మె సమ్మె  చరిత్రలో జరగలేదని, అధికారులను తమ వద్దకు పంపించడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆయన పేర్కొన్నారు.

“మంత్రి లక్ష్మణ్ కుమార్ స్వయంగా నాకు ఫోన్ చేస్తారని కలలో కూడా అనుకోలేదు. ఆయన ఫోన్ చేసి ఎంతో గౌరవంగా మాట్లాడారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రితో సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఫోన్ చేసి, రోడ్లు, భవనాల శాఖ మంత్రితో మాట్లాడించారు. మా సమస్యల పరిష్కారం కోసం ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న చొరవ మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది” అని బెనర్జీ వివరించారు.

మంత్రి చొరవతోనే ప్రభుత్వ అధికారులు తమ వద్దకు వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారని, ఈ పరిణామం తమకు ఎంతో ఊరటనిచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు. తమ వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలపడంలో ఆలస్యమైనందుకు విచారం వ్యక్తం చేస్తూనే, మంత్రి స్పందనకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

👉విద్యార్థుల కృతజ్ఞతలు.. ప్రజాప్రతినిధుల సమక్షంలో అభినందనలు…!

శనివారం జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందనను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ వాణి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గజంగి నందయ్య, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గిరి నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల సమస్యలపై స్పందించి, సంబంధిత శాఖల మంత్రులు, అధికారుల దృష్టికి వాటిని తీసుకెళ్లడంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన ప్రయత్నాలను విద్యార్థి నాయకులు ప్రశంసించారు.

👉 హామీలు కార్యరూపం దాల్చడమే కీలకం..!

విద్యార్థుల ఆందోళనకు ప్రజాప్రతినిధులు స్పందించడం, అధికార యంత్రాంగం నేరుగా విద్యార్థుల వద్దకు వెళ్లి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం సానుకూల పరిణామం. అయితే, విద్యార్థులు కోరుతున్న హాస్టల్, కిచెన్, బస్సు సదుపాయాల కల్పనతో పాటు కళాశాల భవన నిర్మాణాన్ని నిర్ణీత గడువులో పూర్తి చేయడం ఇప్పుడు కీలకం. డిసెంబర్ 15 నాటికి భవన నిర్మాణ పనులు పూర్తి చేస్తామన్న హామీ ఎంతవరకు అమలవుతుందనేది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.