పేదరికం విద్యార్థి ప్రతిభకు అడ్డంకి కాకూడదు.!

👉 పేద పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్యే లక్ష్యం!


👉 ఫూలే, అంబేద్కర్‌ ఆశయాలతోనే సామాజిక సాధికారత
!


👉 గురుకులాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు !


👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


పేదరికం ఏ విద్యార్థి ప్రతిభకు అడ్డంకి కాకూడదు.. అణగారిన వర్గాల పిల్లలకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.. మహనీయులు ఫూలే, అంబేద్కర్‌ చూపిన విద్యా, సామాజిక న్యాయ మార్గంలో ముందుకు సాగుతూ గురుకులాలను ఆధునిక వసతులతో బలోపేతం చేస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రజాసేవలో పుట్టపాగ మహేంద్రనాథ్‌ చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లిలో శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే, మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్‌ అందించిన సేవలు చిరస్మరణీయమని  మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా మహేంద్రనాథ్‌ ప్రజాసేవలను స్మరించుకుంటూ, విద్యాభివృద్ధి, పేదలు, అణగారిన వర్గాల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని మంత్రి కొనియాడారు.

👉 గురుకులాలకు కార్పొరేట్‌ హంగులు!

పేదరికం కారణంగా ఏ విద్యార్థి విద్యకు దూరం కాకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. గురుకులాల్లో భవనాలు, తరగతి గదులు, వసతిగృహాలు, క్రీడా మైదానాలు, నాణ్యమైన ఆహారం, యూనిఫారాలు, షూస్‌ తదితర మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

👉 రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గురుకుల వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, యంగ్‌ ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ద్వారా పేద విద్యార్థులకు ఆధునిక విద్యా సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. నైపుణ్యం కలిగిన బోధనా సిబ్బంది, ప్రయోగశాలలు, క్రీడా సదుపాయాలతో విద్యార్థులను ఉన్నత లక్ష్యాల దిశగా తీర్చిదిద్దుతామని వివరించారు.

👉 విద్యతోనే సమానత్వం.. సాధికారత!

ఫూలే చూపిన విద్యా మార్గం, అంబేద్కర్‌ అందించిన రాజ్యాంగ విలువలు సమాజానికి స్ఫూర్తిదాయకమని మంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర అణగారిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు.


మహేంద్రనాథ్‌ వంటి ప్రజాసేవకుల ఆశయాలను సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముందుకు తీసుకెళ్లడమే వారికి అందించే నిజమైన నివాళి అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కాశీం, మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్‌, విద్యా కమిషన్‌ సభ్యుడు కొండల్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.