👉 ధర్మపురి, కోటిలింగాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..!
👉 భూసేకరణ, టెండర్లు, ప్రభుత్వ అనుమతులకు సంబంధించిన పెండింగ్ అంశాలను వెంటనే పరిష్కరించాలి !
👉 మహాలక్ష్మి ఘాట్ వద్ద మురుగునీరు గోదావరిలో కలవకుండా పటిష్టమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి !
👉 దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్.!
J.SURENDER KUMAR,
గోదావరి పుష్కరాలు–2027 ను ప్రశాంతంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించారు.
సోమవారం దేవాదాయ కమిషనర్ హనుమంతరావుతో కలిసి సంబంధిత జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
పుష్కరాల కోసం చేపట్టిన భూసేకరణ, ఘాట్ల అభివృద్ధి, రహదారుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పన, అదనపు పనుల ప్రతిపాదనలు, వివిధ శాఖల టెండర్ల పురోగతిని సమీక్షించారు.
👉 దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ,..

గోదావరి పుష్కరాల పనుల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పుష్కరాలు ప్రారంభమయ్యే సమయానికి ఎలాంటి పనులు పెండింగ్‌లో ఉండకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని, ప్రతి పనికి స్పష్టమైన లక్ష్యాలు, గడువులు నిర్దేశించుకుని పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
టెండర్లు, పరిపాలనా అనుమతులు, భూసేకరణ వంటి అంశాల్లో పెండింగ్‌ను తొలగించి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనులను తనిఖీ చేస్తూ పురోగతిని సమీక్షించాలని సూచించారు.
👉 భూసేకరణ, ప్రభుత్వ అనుమతులపై ప్రత్యేక దృష్టి !
పుష్కర ఘాట్లు, రహదారులు, ఇతర సౌకర్యాల అభివృద్ధికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు. భూసేకరణకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన ప్రాంతాల్లో తదుపరి చర్యలను పూర్తి చేయడంతోపాటు, ప్రభుత్వ ఆమోదం, సెక్షన్ 10ఏ మినహాయింపు, ఇతర అనుమతుల కోసం పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని ఆదేశించారు.
భూసేకరణకు సంబంధించిన సమస్యలను జిల్లా స్థాయిలో గుర్తించి, పరిష్కారం కోసం ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలను ఆలస్యం చేయకుండా పంపించాలని తెలిపారు. వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచి, అనుమతుల ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.
👉 కొత్త ఘాట్ల నిర్మాణానికి క్షేత్రస్థాయి సాధ్యాసాధ్యాల పరిశీలన !
కొత్త పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రజాప్రతినిధుల నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించేటప్పుడు భక్తుల అంచనా సంఖ్య, ఇప్పటికే అందుబాటులో ఉన్న ఘాట్ల సామర్థ్యం, నదిలో నీటి ప్రవాహం, భద్రత, రహదారి సౌకర్యాలు, రాకపోకల నిర్వహణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సూచించారు.
కొత్త ఘాట్ల అవసరాన్ని జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాధ్యాసాధ్యాల నివేదిక అందించాలని, ఇప్పటికే ఉన్న ఘాట్లను మరింత మెరుగుపరచడం ద్వారా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే అవకాశాలను పరిశీలించాలని తెలిపారు.
నదీ ప్రవాహ ప్రాంతాలకు సమీపంలో ఘాట్ల నిర్మాణం చేపట్టేటప్పుడు భద్రతా అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవసరానికి మించిన కొత్త నిర్మాణాలకు బదులుగా మరమ్మతులు, ఘాట్ల విస్తరణ, అప్రోచ్ రోడ్ల అభివృద్ధి వంటి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
👉 టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలి !
దేవాదాయ, నీటిపారుదల, రహదారులు–భవనాలు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనుల టెండర్ల స్థితిగతులను సమీక్షిస్తూ, టెండర్లు పూర్తయిన పనులను వెంటనే ప్రారంభించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు. టెండర్ల పరిశీలన, ఎల్–1 ఖరారు, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ జారీ, ఒప్పందాల ప్రక్రియల్లో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
సాంకేతిక పరిశీలనలో ఉన్న డ్రాయింగులు, సవరించిన అంచనాలు, ఇతర అనుమతులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. రెండోసారి టెండర్లు పిలవాల్సిన పనుల విషయంలోనూ తగిన చర్యలు తీసుకుని పనులు సకాలంలో ప్రారంభమయ్యేలా చూడాలని ఆదేశించారు.
పుష్కరాల కోసం ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన అదనపు పనులను భక్తులకు కలిగే ప్రయోజనం, అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, అంచనా వ్యయం, పనుల అత్యవసరత ఆధారంగా పరిశీలించాలని సూచించారు. కొత్త ఘాట్ల నిర్మాణం కంటే ఇప్పటికే ఉన్న ఘాట్ల మరమ్మతులు, రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ, అప్రోచ్ రోడ్లు, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత అవసరమైన ప్రాంతాల్లో తగిన నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు.
అదనపు బడ్జెట్ అవసరమయ్యే పనులకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి, సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.
👉 భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలి!
పుష్కరాల సమయంలో భారీగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా రహదారులు, రాకపోకల నిర్వహణ, పారిశుద్ధ్యం, తాగునీరు, ఇతర ప్రాథమిక సౌకర్యాల కల్పనకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశించారు.
నదీ తీర ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
ప్రతి జిల్లా కలెక్టర్ తమ పరిధిలోని పుష్కర ప్రాంతాల వారీగా పనుల పురోగతిని సమీక్షిస్తూ, ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పుష్కరాలు ప్రారంభమయ్యేలోగా అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
👉 దేవాదాయ కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ,

కొత్త పుష్కర ఘాట్ల నిర్మాణాన్ని భక్తులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా పక్కా ప్రణాళికతో చేపట్టాలని అధికారులకు సూచించారు. ఘాట్ల నిర్మాణానికి ముందు భక్తుల రద్దీ, అందుబాటులో ఉన్న స్థలం, రాకపోకల సౌకర్యాలు, భద్రత, మురుగునీటి సమస్యలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు.
👉 ధర్మపురిలో మహాలక్ష్మి ఘాట్ సమీపంలో ప్రతిపాదించిన కొత్త ఘాట్ నిర్మాణానికి సంబంధించి అక్కడ ఉన్న స్మశాన వాటికకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని, ఆ ప్రహరీ గోడ నుంచి ఐదు మీటర్ల దూరం పాటిస్తూ కొత్త ఘాట్ నిర్మాణం చేపట్టాలని సూచించారు.
మహాలక్ష్మి ఘాట్ వద్దకు మురుగునీరు చేరకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే మంజూరైన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్.టీ.పీ.) పనులు పుష్కరాల నాటికి పూర్తయ్యేలా ఉన్నాయా లేదా పరిశీలించాలని తెలిపారు.
👉ఎస్‌టీపీ పనులు నిర్దేశిత సమయానికి పూర్తికాని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు.
మురుగునీరు ఘాట్ వద్దకు చేరితే కొత్తగా ఘాట్ నిర్మించినప్పటికీ భక్తులు దానిని వినియోగించలేని పరిస్థితి ఏర్పడుతుందని, ప్రజాధనం వృథా కాకుండా నిర్మాణంతోపాటు పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.
👉 ధర్మపురి వీఐపీ ఘాట్ నిర్మాణానికి ₹ 6 కోట్లు మంజూరైన నేపథ్యంలో, ఘాట్‌ను భక్తులు వినియోగించుకునేందుకు అవసరమైన రెండు వంతెనల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని దేవాదాయ కమిషనర్ సూచించారు. ఎనిమిది నెలల వ్యవధిలో కాంక్రీట్ వంతెనల నిర్మాణం సాధ్యమవుతుందా అనే అంశాన్ని పరిశీలించడంతోపాటు, ప్రత్యామ్నాయంగా స్టీల్ వంతెనల నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయా అని పరిశీలించాలని తెలిపారు. అలాగే, ప్రత్యామ్నాయ రహదారుల అభివృద్ధికి ఉన్న అవకాశాలను ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా అంచనా వేసి, సాంకేతికంగా సాధ్యమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
👉ధర్మపురి ప్రాంతంలో మంజూరైన ₹ 18 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
👉 కోటిలింగాల నాలుగు వరుసల రహదారి పనులు వెంటనే ప్రారంభించాలి.!

కోటిలింగాల ప్రాంతంలో రహదారి విస్తరణ, నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి ₹ 22 కోట్లు మంజూరైనట్లు దేవాదాయ కమిషనర్ తెలిపారు. ఈ పనులకు భూసేకరణ అవసరం లేదని పేర్కొంటూ, టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
👉 పుష్కరాలకు పరిమిత సమయం మాత్రమే ఉన్నందున రహదారి విస్తరణ పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పంచాయతీరాజ్, రహదారులు–భవనాలు, మున్సిపల్ శాఖల పరిధిలో చేపట్టాల్సిన రహదారి పనులకు సంబంధించిన టెండర్లను త్వరగా పూర్తి చేసి, పనులను నిర్ణీత గడువులోగా చేపట్టాలని సూచించారు.
👉 ప్రతి ఘాట్‌లో భద్రత, అన్ని మౌలిక వసతులు తప్పనిసరి
పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సంఖ్యలో ఘాట్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఘాట్‌లో భక్తులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని దేవాదాయ కమిషనర్ సూచించారు. భక్తులందరూ ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా వివిధ ఘాట్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని, ఏ ఒక్కచోటా అధిక రద్దీ ఏర్పడి తొక్కిసలాటకు దారితీయకుండా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు.
👉 ఘాట్ల పరిమాణం, విస్తీర్ణం విషయంలో రాజీ పడకుండా భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్మాణాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రతి ఘాట్‌లో దివ్యాంగులు సులభంగా చేరుకునేందుకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని, భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.
👉 సంబంధిత జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని పుష్కర ఘాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన పనులను గుర్తించాలని తెలిపారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో సాధ్యమైనన్ని ఘాట్లను అభివృద్ధి చేయడంతోపాటు ప్రతి ఘాట్‌లో భక్తులకు అవసరమైన సౌకర్యాలు ఉండేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
👉 జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ,..

గోదావరి పుష్కరాలు–2027 నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
👉 ధర్మపురి ప్రాంతంలో మున్సిపాలిటీ పరిధిలో 1.08 ఎకరాల భూసేకరణకు సంబంధించి, కోటిలింగాల ప్రాంతంలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 3 ఎకరాల భూసేకరణకు సంబంధించి 2026 సెప్టెంబర్ 22న ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఈ భూసేకరణకు సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు.
👉 ధర్మపురిలో కొత్త ఘాట్ నిర్మాణానికి అవసరమైతే సమీపంలోని స్మశాన వాటికను తొలగించి, ఆ ప్రాంతాన్ని చదును చేసే అవకాశాలను పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఘాట్ వద్ద మురుగునీటి సమస్య పరిష్కారానికి సంబంధించి సెక్షన్ 10ఏ మినహాయింపు కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు.
👉 ఎస్‌టీపీ పనులు పుష్కరాల నాటికి పూర్తికాని పరిస్థితి ఏర్పడినా మురుగునీరు గోదావరిలో కలవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. మురుగునీటిని దారి మళ్లించేందుకు పటిష్టమైన ప్రణాళిక సిద్ధం చేస్తామని, మహాలక్ష్మి ఘాట్ వద్దకు మురుగునీరు చేరకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డంప్ యార్డును కూడా దారి మళ్లించే చర్యలు చేపడుతున్నామని, ఎస్‌టీపీ పనులు సైతం కొనసాగుతున్నాయని తెలిపారు.
👉 ధర్మపురి, కోటిలింగాల పుష్కర ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ టెండర్లు, భూసేకరణ, రహదారులు, ఘాట్ల అభివృద్ధి తదితర అంశాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షిస్తూ, కోటిలింగాల నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.
👉 పంచాయతీరాజ్, రహదారులు–భవనాలు, మున్సిపల్ శాఖల పరిధిలో చేపట్టనున్న రహదారుల అభివృద్ధి పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
👉 గోదావరి పుష్కరాలు–2027 ఏర్పాట్లకు ఇంకా ఏడు నెలల సమయం మాత్రమే ఉన్నందున పనులను ఈ నెలలోనే ప్రారంభించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
👉 పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ధర్మపురి, కోటిలింగాల ప్రాంతాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ఘాట్లు, రహదారులు, పారిశుద్ధ్యం, మురుగునీటి మళ్లింపు, తాగునీరు, భద్రత తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ప్రతి ఘాట్‌ను భక్తులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేయాలని, పుష్కరాలు ప్రారంభమయ్యే సమయానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈవీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్.డి.ఓ. లు, తహసీల్దార్లు , వివిధ ఇంజినీరింగ్, దేవాదాయ, మున్సిపల్ శాఖల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
