ప్రొఫెసర్ వారిజారాణికి ‘గురు వందనం’ పురస్కారం!

👉 తెలుగు భాషా సాహిత్య రంగంలో విశేష సేవలకు గుర్తింపు.


J.SURENDER KUMAR,

ప్రముఖ విద్యావేత్త, సాహితీవేత్త, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం  ( సెంట్రల్ యూనివర్సిటీ) తెలుగు శాఖ ఆచార్యురాలు ఆచార్య పాలెపు వారిజారాణికి ‘గురు వందనం–2026’ పురస్కారం లభించింది. ఉపాధ్యాయుల సేవలను గౌరవిస్తూ, విద్యారంగ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్న వారిని సత్కరించే లక్ష్యంతో జీ తెలుగు న్యూస్ నిర్వహించిన ‘గురు వందనం–2026 ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్ అండ్ టీచర్స్ అవార్డ్స్’ కార్యక్రమంలో ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది.

ఈ కార్యక్రమంలో సిద్ధిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీశ్ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, జీ తెలుగు న్యూస్ చీఫ్ ఎడిటర్ భారత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌లో భాగంగా ఉన్నత విద్యపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో తెలంగాణ ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, ఆచార్య పాలెపు వారిజారాణి, విద్యావేత్త సునీల్ కుమార్ పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

👉 ప్రొఫెసర్ వారిజారాణి, గూర్చి……

తెలుగు భాష, సాహిత్యం, సంస్కృత భాషా అధ్యయనం, పరిశోధన, బోధన, సంగీత రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్న వారిజారాణి ప్రాచీన–ఆధునిక సాహిత్య సంప్రదాయాల సమన్వయానికి కృషి చేస్తున్నారు. సాహిత్యం, సంగీతాల సమ్మేళనంగా, తెలుగు–సంస్కృత భాషల సమతౌల్యాన్ని ప్రతిబింబించే ఆమె విద్యా ప్రస్థానం బహుముఖమైనది.


👉 ధర్మపురి లక్ష్మీనరసింహాంధ్ర కళాశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన ఆమె, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బీఏలో బంగారు పతకాన్ని సాధించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఏ పట్టాలు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో మాస్టర్స్ డిగ్రీ, కేంద్రీయ విశ్వవిద్యాలయం నుంచి తులనాత్మక అధ్యయనంలో ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య పర్యవేక్షణలో డాక్టరేట్ పొందారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాతో పాటు సంగీతంలోనూ డిప్లొమా సాధించారు. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఎంపిక చేసిన ‘యంగ్ సైంటిస్ట్’గా రెండేళ్లపాటు స్కాలర్‌షిప్ పొందారు.

ప్రొఫెసర్ వారిజ రాణి ( ఫైల్ ఫోటో)


👉 ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యురాలిగా, కోటి మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా సేవలందించిన వారిజారాణి ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. అమెరికాలోని ఆరియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు గౌర ఆచార్యురాలిగా కూడా సేవలందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారాన్ని అందుకున్న ఆమె, కేంద్ర ప్రభుత్వ సెన్సార్ బోర్డు సభ్యురాలిగా రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వహించారు.


👉 పరిశోధన రంగంలోనూ ఆమె కృషి విశేషమైనది. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సుల్లో సుమారు 50 పరిశోధనా పత్రాలను సమర్పించారు. నాలుగు పుస్తకాలకు సంపాదకత్వం వహించడంతో పాటు, తెలుగు, ఆంగ్ల భాషల్లో 60కి పైగా వ్యాసాలను వివిధ సాహిత్య పత్రికల్లో ప్రచురించారు. పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పాఠ్య ప్రణాళికా సంఘ సభ్యురాలిగా వ్యవహరించారు. వివిధ విశ్వవిద్యాలయాల దూరవిద్యా కేంద్రాల స్నాతక స్థాయి పాఠ్యగ్రంథాల రచయితగా, సంపాదకురాలిగా సేవలందించారు.


👉 విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించడంలోనూ ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె పర్యవేక్షణలో ఇప్పటివరకు 19 మంది పరిశోధకులు డాక్టరేట్ పట్టాలు పొందగా, మరో ఎనిమిది మంది పరిశోధకులు ప్రస్తుతం పీహెచ్‌డీ కోసం పరిశోధనలు కొనసాగిస్తున్నారు.


👉 బోధనను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా, భాషా సంస్కృతుల పరిరక్షణకు, సాహిత్య పరిశోధనకు, కొత్త తరాల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి కృషి చేస్తున్న ఆచార్య పాలెపు వారిజారాణికి లభించిన ‘గురు వందనం–2026’ పురస్కారం ఆమె విద్యా, సాహిత్య సేవలకు లభించిన మరో ముఖ్యమైన గుర్తింపుగా నిలిచింది.