విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు కోసం..!

👉 జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్ తో ఒప్పందం !

👉 డిసెంబర్ 9 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సెంట్రలైజ్డ్ కిచెన్లను ప్రారంభించేలా చర్యలు !

👉 అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J . SURENDER KUMAR,


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయడానికి ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  సమక్షంలో జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్ తో ఒప్పందం చేసుకున్నాయి.

👉 హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు, జున్నా సోలార్ సిస్టమ్స్, చైన్ ల్యాబ్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు. నాగర్‌కర్నూల్, వికారాబాద్‌లలో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు ఈ రెండు సంస్థలు హరేకృష్ణ ఫౌండేషన్ కు సహకారం అందిస్తాయి.

👉 నాగర్‌కర్నూల్‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కోసం జున్నా సోలార్ సిస్టమ్స్ సంస్థ సీఎండీ శేఖర్ రెడ్డి , సీఈఓ అనిల్ బాబుతో కలిసి ₹ 5.17 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.

👉 వికారాబాద్‌లో ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ నిర్మాణం కోసం చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థ ప్రతినిధి డి. సుమంత్ గారు, వైస్ ప్రెసిడెంట్ బుగత సంతోష్ కుమార్ తో కలిసి ముఖ్యమంత్రి  చేతుల మీదుగా ₹ 4 కోట్ల చెక్కును హరే కృష్ణ ఫౌండేషన్‌కు అందించారు.

👉 ఒక మంచి కార్యక్రమానికి నిధులు అందించి సహకరించడానికి ముందుకు వచ్చిన సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి  అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి , హరే కృష్ణ ప్రతినిధి సత్య గౌర చంద్ర దాస్ స్వామీజీతో పాటు ఇతర ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

👉 వచ్చే డిసెంబర్ 9 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి సెంట్రలైజ్డ్ కిచెన్లను ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ఆదేశించారు. నవంబర్ 30వ తేదీలోగా ఈ కిచెన్ల ఏర్పాట్లు పూర్తయ్యేలా చూడాలని చెప్పారు.

👉 ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ కిచెన్లను విద్యార్థులు సందర్శించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు.

👉 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ట్రాక్ రికార్డును నిర్వహించాలని, విద్యార్థుల శారీరక పెరుగుదల, విద్యా పురోగతి వంటి అంశాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ముఖ్యమంత్రి  సూచించారు. ఆహారంలో ఇచ్చే పదార్థాల కేలరీలను లెక్కించడానికి యాప్‌లను ఉపయోగించుకోవాలని చెప్పారు.

👉 బ్రేక్‌ఫాస్ట్ వల్ల విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకుంటారని, విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు..

👉 ప్రాంతాల వారీగా అక్కడి అలవాట్లకు అనుగుణంగా బ్రేక్‌ఫాస్ట్‌ను అందించే విధంగా చూడాలని, జీవితకాలం కొనసాగించాల్సిన ఈ కార్యక్రమం కాబట్టి సెంట్రల్ కిచెన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని సూచించారు.