ఓటును కాపాడండి – దేశాన్ని రక్షించండి!

👉  అర్హుల ఓట్లు తొలగించకుండా పారదర్శకత అవసరం !

👉  ఓటు మిస్సింగ్‌పై ప్రజల్లో చర్చ..!

👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. !


J.SURENDER KUMAR,


ఓటర్ల జాబితాల్లో అర్హులైన పౌరుల పేర్లు మిస్సింగ్‌ కాకుండా, ఓట్ల తొలగింపు ప్రక్రియలో పూర్తి పారదర్శకత ఉండాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ఆ హక్కును కాపాడుకోవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవచ్చని పేర్కొన్నారు.

ఇండియా కూటమి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన “ప్రజాస్వామ్య పరిరక్షణ వారోత్సవం–ఓటును కాపాడండి, దేశాన్ని రక్షించండి” కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

ఎన్నికల జాబితాల్లో ఓట్ల తొలగింపు, మార్పుల విషయంలో ఓటర్లకు పూర్తి స్పష్టత ఉండాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థను ఉపయోగించుకుని పెద్ద సంఖ్యలో ప్రజల ఓట్లను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని మంత్రి ఆరోపించారు.

👉 అయితే, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాల్లో కొనసాగుతున్నాయా ?  లేదా ? అన్నది ప్రతి పౌరుడు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కును ఎవరైనా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

👉 మతం పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధానాలకు స్వస్తి పలకాలని మంత్రి అన్నారు. దేశ ప్రజలందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే రాజకీయాలు అవసరమని పేర్కొన్నారు.

👉 ప్రజలే నిర్ణేతలు…!

ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని, వారి ఓటుతోనే ప్రభుత్వాలు ఏర్పడతాయని మంత్రి అన్నారు. యువత, విద్యార్థులు, ప్రజాసంఘాలు ఓటు హక్కుపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాల్లో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవడంతో పాటు, ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు.

👉 రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “ఓటును కాపాడండి.. దేశాన్ని రక్షించండి” అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.

👉 ప్రజల హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఆధ్వర్యంలో కార్యక్రమాలను కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమంలో మిత్రపక్షాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు.