👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. నిర్దేశించిన లక్ష్యాల సాధనలో దేశం ప్రగతి సాధించడానికి తనవంతు కర్తవ్యంగా తెలంగాణ కూడా తోడ్పాటును అందిస్తుందని స్పష్టం చేశారు.
👉 హైదరాబాద్ హైటెక్స్‌లో 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ వార్షిక సదస్సును ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కలిసి ప్రారంభించారు. ఈ సదస్సులో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దేశ భద్రత, జాతీయ ప్రాధాన్యతలు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమం వంటి విషయాల్లో రాజకీయాలకు తావు లేకుండా ఐక్యంగా పనిచేయాలని అన్నారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేసి మిగిలిన సమయం దేశాభివృద్ధిపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.
👉 తెలంగాణలో చేపట్టాల్సిన రోడ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే అనేక సందర్భాల్లో అందించామని గుర్తుచేస్తూ వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు.
👉 “వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం సైతం స్పష్టమైన విధానాలతో ముందుకు వెళుతోంది. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణ తనవంతుగా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. కేంద్రం కూడా తనవంతుగా రాష్ట్రానికి సహకారం అందించాలి.
👉 అందుకోసం తెలంగాణను మూడు జోన్లుగా విభజన చేసి లక్ష్యాలను నిర్దేశించాం. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి భాగాన్ని సర్వీస్ సెక్టార్‌గా, ఓఆర్ఆర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు మధ్య భాగం తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం. రీజినల్ రింగ్ రోడ్డు నుంచి రాష్ట్ర సరిహద్దు ప్రాంతం వరకు వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తున్నాం.

👉 ఆయా రంగాలు అభివృద్ధి సాధించడానికి రవాణా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకు పటిష్టమైన రోడ్ నెట్వర్క్ ఉండాలి. ప్రధానంగా నగరాలు, గ్రామాలతో పాటు పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేస్తూ రోడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం ద్వారా కనెక్టివిటీ, మొబిలిటీ పెరుగుతాయి. తద్వారా వ్యాపార, వాణిజ్య రంగాలు వృద్ధి సాధిస్తాయి.
👉 మౌలిక సదుపాయాల కల్పనలో రోడ్లు మాత్రమే కాకుండా హెల్త్‌కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా తెలంగాణ ఎన్నో కీలకమైన చర్యలు చేపట్టింది. హెల్త్ కేర్ ప్రాధాన్యత దృష్ట్యా పురాతన ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని అత్యంత అధునాతన వసతులతో నిర్మిస్తున్నాం. అలాగే రాష్ట్రంలోని టిమ్స్ ఆస్పత్రులు, వరంగల్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మొత్తంగా 8 వేల పడకల సామర్థ్యంతో ఆస్పత్రులను నిర్మిస్తున్నాం” అని ముఖ్యమంత్రి వివరించారు.
👉 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్‌కు హైదరాబాద్ వేదిక కావడం గర్వకారణంగా ఉందని చెప్పారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగస్వాములు కావాలని సదస్సుకు హాజరైన ప్రతినిధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు.
👉 ఈ సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు , ఐఆర్సీ అధ్యక్షుడు లక్ష్మి కాంత పది , ఇతర కార్యవర్గ సభ్యులు, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు, ఆయా సంస్థలకు చెందిన నిపుణులు హాజరయ్యారు.
