రెవెన్యూ డివిజన్ లలో ప్రజావాణి !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !

J SURENDER KUMAR,

రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి ప్రారంభించాలని తరువాత దశలో మండల స్థాయికి ప్రజావాణిని విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి  అన్ని స్థాయిల్లో అధికారులకు పూర్తి అధికారాలు ఇవ్వాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి  ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు.

👉 ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజున (2023 డిసెంబర్ 8వ తేదీన) ప్రజావాణి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి  ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి మంగళవారం, శుక్రవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో ప్రజావాణి విజయవంతంగా అమలవుతోంది.

👉 అన్ని విభాగాలకు చెందిన అధికారులు అక్కడికక్కడే ప్రజలు ఇచ్చే అర్జీలు, దరఖాస్తులను స్వీకరించి వేగవంతంగా వాటిని పరిష్కరించే చర్యలు చేపడుతున్నారు. జిల్లా స్థాయిలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రతి వారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు.

👉 దూర ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు, జిల్లా కేంద్రానికి వచ్చే బదులు ప్రజావాణి సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి  ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుతో పాటు సీఎంవో అధికారులను ఆదేశించారు.


👉 ప్రజలు ఇచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేయాలని, సంబంధిత విభాగాలకు పంపించాలని, పరిష్కార పురోగతిని అర్జీదారునికి తెలియజేయాలని ముఖ్యమంత్రి  అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుల పరిష్కారానికి నిర్ణీత గడువులు ఉండాలని, ఆలస్యం జరగకూడదని చెప్పారు.
ఫిర్యాదుల నమోదు, ట్రాకింగ్, పరిష్కారానికి ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో రియల్ టైమ్ మానిటరింగ్ ఉండాలని సూచించారు.

👉 ప్రతి స్థాయిలో ప్రజావాణికి ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ, ప్రతి శాఖలో ప్రత్యేక ప్రజావాణి విభాగాలు ఏర్పాటు చేయాలన్నారు. ఒకస్థాయిలో పరిష్కారం కాకపోతే, పైస్థాయి అధికారికి అర్జీ అందేలా ఆటో ఎస్కలేషన్ వ్యవస్థను అమలు చేయాలని చెప్పారు. అవసరమైతే అప్పీల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని సూచించారు.

👉 ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియలో ఎలాంటి రాజీ ఉండకూడదని, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. డ్యాష్‌బోర్డ్ ద్వారా పరిష్కార పురోగతి తెలుసుకునే వీలుండాలని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులను బాధ్యులుగా చేయాలని చెప్పారు.

👉 ప్రజావాణి సేవలను వికేంద్రీకరించటంతో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో పెండింగ్ అర్జీల సంఖ్య తగ్గుతుందని, కిందిస్థాయిలోనే కొన్ని పరిష్కరించే వీలుంటుందని ముఖ్యమంత్రి  సూచించారు. ప్రజలకు నమ్మకంగా ఉండేలా ప్రజావాణి సేవలు అందించాలని సూచించారు.