👉 కొడుకు వాయిస్ మెసేజ్ కు… గణపతి స్పందన ఎలా ఉంటుందో ?
J .SURENDER KUMAR,
దాదాపు ఐదున్నర దశాబ్దాల కాలంగా, అడవుల్లో, అజ్ఞాతంలో ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుప్రీం, ముప్పాల లక్ష్మణరావు, @ గణపతి, తల్లి స్వర్గీయ ముప్పాల శేషమ్మ, తన కొడుకు రాక కోసం ఆశతో ఆమె జనరణ్యాలలో చేసిన , అభ్యర్థనలు, ఆర్తనాదాలు అడవి తల్లి ఒడిలో అజ్ఞాతం గడుపుతున్న కొడుకు గణపతికి వినిపించలేదో, వినిపించినా, లక్షలాది తల్లుల గొంతుకలలో ఒకటిగా గణపతి భావించి ఉండవచ్చు. మూడున్నర దశాబ్దాల క్రితం వరకు ఆ మాతృమూర్తి స్వగ్రామం బీర్పూర్ తోపాటు, తన తల్లి ఊరు మానకొండూరు మండలం, గంగిపల్లి , కన్న కూతుర్ల గ్రామాలలో ఆశతో తన కొడుకు రాక కోసం ఆమె అభ్యర్థనలు చేస్తూ (1992-93) ఆశువులు బాసిన ఆ మాతృమూర్తి, ఆయా గ్రామాలలో ఆమె చేసిన అభ్యర్ధనలు, దశాబ్దాల కాలం గడిచినా ఆ తల్లి మాటలు, ఆవేదన, ఆత్మఘోష, నేటికీ ఇంకా గాలిలో మారుమోగుతూనే ఉన్నాయి.
మావోయిస్టు ఉద్యమ మాస్టర్ మైండ్, మౌనముని, ముప్పాల లక్ష్మణరావు @ గణపతి, కన్నతల్లి స్వర్గీయ ముప్పాల శేషమ్మ అరుదైన ఫోటో గణపతి సామాజిక వర్గ బంధు వర్గంలోని పురాతన గ్రూప్ ఫోటోలలో ఆగుపించింది, ఈ నేపథ్యంలో ఆమె తన కొడుకు గణపతి అజ్ఞాతం వీడి ఇంటికి రాక కోసం రోదించిన తీరు, పడిన ఆవేదన, తపన గూర్చి ఆరు పదులు దాటిన వృద్ధ గ్రామస్తులు, వారి బంధు వర్గంలో కొనసాగుతున్న చర్చ.
గణపతి రాక కోసం మా దొరసాని, ( గణపతి తల్లి ) చేయని పూజలు లేవు, మొక్కని దేవుడు లేరు, అంటూ గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. గణపతి ఆచూకీ పేరిట పోలీసులు ఆయన కుటుంబ సభ్యులను, బంధు వర్గాన్ని వివరాలు సేకరణ, విచారణ పేరిట, మాటలతో అనుమానపరుస్తూ వేధించిన తీరుతో ఇతర ప్రాంతాల్లో వారు తలదాచుకునే దుస్థితి ఏర్పడిందనేది గ్రామస్తులు కథనం.
మావోయిస్టు రహిత భారత్ కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ 2026, మార్చి 31 కి ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ , పొలిటి బ్యూరో,సభ్యులు, మిలటరీ, గెరిల్లా లీడర్ లు తమ తమ క్యాడర్ లతో రెడ్ కారిడార్, దండకారణ్యం వీడి, వందలాదిమంది , అధునాతన ఆయుధాలు ,డబ్బులు బంగారం తో ప్రభుత్వాలకు లొంగిపోయారు లొంగిపోతున్నారు మావోయిస్టు ముక్త్ భారత్ గా కేంద్ర ప్రకటించింది, గత రెండు రోజుల క్రితం రాష్ట్ర డిజిపి సి వీ ఆనంద్, మావోయిస్టు కదలికలు, కార్యకలాపాలు లేని తెలంగాణ లో గ్రేహౌండ్స్ విభాగం రద్దు చేస్తూ ఆ సిబ్బంది నీ సైబర్ క్రైమ్ , డ్రగ్స్, తదితర అంశాలపై నియంత్రణ కు బదిలి చేస్తున్నట్లు ప్రకటించారు.
👉 నాడు తల్లి.. నేడు కొడుకు ఆత్మఘోష…

ఇటీవల అమెరికాలో ఉంటున్న గణపతి కుమారుడు ( శ్రీనివాస్ @ వాసు) సైతం తన తండ్రి గణపతి లొంగిపోవాలని కోరుతూ వాయిస్ మెసేజ్ విడుదల చేయడం చర్చనీయాంశమైంది. “ఇప్పటికైనా కుటుంబం వద్దకు రండి నాన్న, మిగిలిన జీవితం ప్రశాంతంగా గడపండి” అనే కుమారుడి విజ్ఞప్తి వెనుక కూడా అదే నానమ్మ ( గణపతి తల్లి) ఆవేదన కనిపించింది అనేది పలువురు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.
👉 దశాబ్దాలు గడిచాయి … కాలం మారింది… ఉద్యమాల పేర్లు మారాయి !
ఆ తల్లి గుండెల్లో కొడుకు కోసం నాలుగు దశాబ్దాల క్రితమే ఆమె ఆవేదన మాత్రం చరిత్రలో చెరిగిపోలేదు. మావోయిస్టు అగ్రనేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన గణపతి… అడవుల్లో ఎన్నో దశాబ్దాలు దాటిపోయాయి. కేంద్ర , రాష్ట్ర భద్రత బలగాలు గగనం నుంచి గాలించినా, అడవులను అణువు , అణువు జల్లెడ పట్టినా గణపతి జాడ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఒకప్పుడు దండకారణ్యాన్ని కుదిపేసిన మావోయిస్టు ఉద్యమం నేడు ఉనికి లేకుండా బలహీనపడిపోయిందనే చర్చల మధ్య… ఇప్పుడు మాత్రం ఆ తల్లి ఆత్మగోషే. మిగిలింది.
1992 – 93 లో కన్నుమూసిన గణపతి తల్లి శేషమ్మ … తన చివరి రోజుల్లో “నా కొడుకు ఇంటికి (జనజీవన స్రవంతిలోకి) రావాలి” అనే ఆశతోనే కన్నుమూసిందని ఆ తల్లి బంధు వర్గం , కుటుంబ సభ్యులు, పరిచయస్తులు చెబుతుంటారు.
ఇప్పుడు గణపతి వయసు 80 దాటిందనే ప్రచారం జరుగుతున్న వేళ ఆ తల్లి ఆత్మగోష, కొడుకు వాసు, తన తల్లి గర్భంలో ఉండగానే , భూమి కోసం, భుక్తి కోసం బడుగు, బలహీన వర్గాల, విముక్తి కోసం అంటూ బంధుకు పట్టి అడవి బాట పట్టిన గణపతి, నేటికీ కన్న కొడుకును చూడలేదు, తనను చూడని తండ్రి గణపతికి కొడుకు వాయిస్ మెసేజ్ ద్వారా చేసిన విజ్ఞప్తి, ఆ కుటుంబం ఎదురుచూపు, ఈ ప్రశ్నలు గణపతితో పాటు సమాజం ముందున్నాయి.
అడవుల్లో ముగిసిపోతున్న జీవితాల కన్నా …కుటుంబం మధ్య మిగిలిన రోజులు గడపడం గొప్పది కాదా ?… తుపాకీ శబ్దాల కన్నా… మనవళ్ల ముద్దు మాటలు, ముసి, ముసి నవ్వులు చూసే యోగం గణపతికి ఉందో ? లేదో ? కానీ, ఆ తల్లి చనిపోయినా… ఆమె పిలుపు మాత్రం ఇంకా గణపతి స్వగ్రామంలో గాలిలో బ్రతికే ఉంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గౌరవ లొంగుబాటు అభ్యర్థనను గణపతి ఆలకించకున్న, ఆచరించకున్న.. నవ మాసాలు మోసి కని పెంచి కన్ను మూసిన కన్నతల్లి ఆఖరి కోరిక , అభ్యర్థనలు, గణపతి గాలికి వదిలేసినా, కన్న కొడుకు ఇటీవల అమెరికా నుండి గణపతి లొంగుబాటు కోసం పంపిన వాయిస్ మెసేజ్ అభ్యర్థన కు స్పందిస్తాడో ? లేదో..? అరణ్యంలో , అజ్ఞాతవాసం గడుపుతు, మృత్యు వాకిట ముందు, అనుక్షణం జీవిస్తూ, మరణిస్తూ, గణపతి జనజీవన స్రవంతిలోకి వస్తాడో ? రాడో ? వేచి చూడాల్సిందే..
👉 మరో రూపంలో రావచ్చు.. రాకపోవచ్చు!
సమాజంలో అణచివేత, దోపిడి, పెట్టి చాకిరి, వివక్షత, ఆకలి ఉన్నంత కాలం పోరాటాలు ఉంటూనే ఉంటాయి.. పోరాటరూపాలు, వాటి చరిత్ర, జ్ఞాపకాలు ఉంటాయి. విప్లవ ఉద్యమాలో, సమ్మెలో, ధర్నాలో, రాస్తారోకోలు, తిరుగుబాటో , ఎవరో పుట్టిస్తే పురుడుపోసుకువి కావు ,ఎన్కౌంటర్లు, మరణాలు , లొంగుబాట్లతో అంతరించేవి కావు, తిరుగుబాటు పోరాటాలు, మరో రూపంలో రావచ్చు….. రాకపోవచ్చు…
