కాళేశ్వరం ప్రాజెక్టు పై చర్చించడానికి సిద్ధం!

👉 ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ శాసనసభకు హాజరు కావాలి  !

👉 ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై మేధావులు, నిపుణుల్లో నమ్మకం కలిగించగలిగితే  పునరుద్ధరణ పనులు !

👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


శాసనసభ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుత స్థితిగతులపై సమగ్రంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  స్పష్టం చేశారు. ఈ విషయంలో అనుభవజ్ఞులైన ప్రతిపక్ష నాయకుడు శాసనసభకు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై మేధావులు, నిపుణుల్లో నమ్మకం కలిగించగలిగితే వారి ఆధ్వర్యంలోనే పునరుద్ధరణ పనులు కొనసాగించడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని నిర్మొహమాటంగా చెప్పారు.

👉 మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి   “కూలిన కాళేశ్వరం – వైఫల్యాల నుంచి పునర్నిర్మాణం వైపు”  అన్న అంశంపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ద్వారా ప్రెజెంటేషన్ ఇచ్చారు.

👉 ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్‌డీఎస్‌ఏతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అందజేసిన నివేదికలన్నింటినీ క్రోడీకరించి వాటి సారాంశాన్ని సమావేశంలో  సీఎం ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…...

తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలు, కూలిన పరిస్థితులు, ఎన్‌డీఎస్ఏతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన నివేదికలతో పాటు ప్రస్తుత పరిస్థితిని వరుస క్రమంలో వివరించారు.

👉 నిపుణులు పరిష్కారం చూపించకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై హడావిడిగా ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు. నిపుణులు మేధావులు పరిష్కారం చూపించకుండా బ్యారేజీలో నీళ్లు నింపితే మరింత పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

👉 “నిపుణులు, మేధావులు ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా భూమి లోపల ఎలాంటి సమస్య ఉందో క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైన పరిష్కారం చూపించినప్పుడే ప్రాజెక్టుపై ముందుకు వెళ్లగలం. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును ఎలాగైనా నిలబెట్టుకోవాలన్నదే ప్రభుత్వ తాపత్రయం” అని ముఖ్యమంత్రి  తేల్చిచెప్పారు.

👉 “ప్రతిపక్ష నాయకుడు కోరిన రోజున అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అవసరమైతే అసెంబ్లీ, కౌన్సిల్ సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టుపై కూలంకుషంగా చర్చకు సిద్ధం. స్పీకర్ కు లేఖ రాయండి. తేదీ ఖరారు చేయండి. ప్రాజెక్టును మాకు అప్పగించాలని అడుగుతున్నారు. ఎందుకు మీకు అప్పగించాలో, నిపుణులు, మేధావులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించగలిగితే ప్రాజెక్టు మరమ్మతు పనులను మీకే అప్పగిస్తాం. మీ గౌరవానికి భంగం కలగకుండా సభను సజావుగా సాగేలా చూసుకునే బాధ్యత మాది. మాకు ఎలాంటి బేషజాలు లేవు” అని ముఖ్యమంత్రి  ప్రతిపాదించారు.

👉 “ఎవరో చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు శిక్ష పడొద్దు. కేసీఆర్  హయాంలో కట్టిన సెక్రటేరియట్, ప్రజాభవన్ వినియోగించడం లేదా? కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతు భరోసా కొనసాగించడం లేదా? నిజంగా కాళేశ్వరం ప్రజల కోసం వినియోగించే పరిస్థితి ఉంటే ఎందుకు ఉపయోగించం. కచ్చితంగా ఉపయోగిస్తాం” అని స్పష్టం చేశారు.

👉 తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞంలో భాగంగా జరిగిన ప్రయత్నాలు, మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు, దాని ఫలితాలు, ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన ఖర్చు వివరాలను ముఖ్యమంత్రి  సమావేశంలో వివరించారు.

👉 చిన్నచిన్న లిఫ్ట్‌లు తప్ప చాలా వరకు గ్రావిటీ ద్వారా 16.60 లక్షల ఎకరాలకు నీరందించడానికి ప్రణాళికలు సిద్ధం చేయగా 148 మీటర్ల ఎత్తు మేరకు ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లోనే మహారాష్ట్ర అంగీకరించిన విషయాలను గుర్తుచేశారు.

👉 “ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ వరకు గోదావరి నదీ జలాలతో సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో ఎంతో ముందుచూపుతో ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి ప్రాజెక్టుపై ₹ 6,157 కోట్లు ఖర్చు చేయగా, 2014 లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేసీఆర్‌ గారు కోరడమే కాకుండా ₹ 5,523 కోట్లు ఖర్చు చేశారు” అని గుర్తుచేశారు.

👉 “ఆ తర్వాత రీడిజైన్ పేరుతో ప్రాజెక్టు స్వరూపం మారిపోయింది. రిటైర్డ్ ఇంజనీర్లతో ఒక కమిటీ వేయగా, ప్రాజెక్టు తుమ్మిడిహెట్టి నుంచి మార్పు సరికాదని ఆ కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది. అయితే, ఆ నివేదికను తొక్కిపెట్టి, మళ్లీ వ్యాప్కోస్ అనే సంస్థకు అప్పగించారు. ఆ తర్వాత ₹ 38 వేల కోట్లతో పూర్తి కావలసిన ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు అంచనాలను పెంచి కాళేశ్వరంగా మార్చారు” అని పేర్కొన్నారు.

👉 “ప్రాజెక్టు కింద డిస్ట్రిబ్యూటరీలు లేవు. ఆయకట్టు పెరగలేదు. కానీ వ్యయం మాత్రం ₹ 1.47 లక్షల కోట్లకు పెరిగిందని కాగ్ తప్పుబట్టిందని చెప్పారు. కాళేశ్వరం డిజైన్, ప్లానింగ్, నిర్మాణం, ఆపరేషన్ మెయింటెనెన్స్ విషయాల్లో ప్రమాణాలు పాటించి ఉంటే ఆ ప్రాజెక్టు గురించి ఇలాంటి చర్చ పెట్టే అవకాశమే ఉండేదని కాదు” అని అన్నారు.

👉 “కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలున్నాయని 2020 లోనే ఒక అధికారి నివేదించారు. లోపాలను సవరించకపోతే ప్రమాదం పొంచి ఉందని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కి లేఖ రాశారు. రిపేర్ చేయకపోవడం, 2023 వరకు పట్టించుకోకపోవడం వల్ల పెరిగి పెరిగి పూర్తిగా కుప్పకూలింది.

👉 గోదావరిలో వరద వచ్చినప్పుడు 2020 జూలై 14 న కన్నెపల్లి పంప్‌హౌస్ కు అడ్డంగా కట్టిన కప్పు కూలిపోయి మొత్తం పంప్ హౌస్ నిండామునిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల.. ఎక్కడైతే బ్యారేజీలు కట్టాలనుకున్నరో అక్కడ భూమిలోపల పరీక్షలు చేయలేదు” అని తెలిపారు.

👉 మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాంతాలు నిర్మాణానికి అనుకూలం కాదని ఇప్పుడే కాదు సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా లేని రోజుల్లోనే సర్ ఆర్ధర్ కాటన్  ఇచ్చంపల్లి వరకు సర్వే చేసి చెప్పారన్నారు. లూస్ సాయిల్ కారణంగా నీటి ఉధృతి కారణంగా ప్రాజెక్టు నిలబడదని ఆనాడే చెప్పారని ముఖ్యమంత్రి  గుర్తుచేశారు.

👉 “అయినప్పటికీ పునాదిలోని భూ పటిష్టతను లెక్కచేయకుండా నిర్మాణాలు చేపట్టారు. ఏకంగా సముద్రాన్ని తెచ్చినట్టు ప్రజల్లో భ్రమలు కల్పించారు. ఇసుక మీద బ్యారేజీ కట్టారు. ఇసుక మేడలు కట్టడం వల్ల గేట్ల అలైన్‌మెంట్లు తప్పాయి. దాంతో గేట్లు తెరుచుకోవడం, మూసుకోవడానికి వీలులేకుండా పోయింది. ఈ ప్రాజెక్టులో మేడిగడ్డ మనిషికి వెన్నుపూస లాంటిది. అదే దెబ్బతిన్నది” అని ఆందోళన వ్యక్తం చేశారు.

👉 “నాణ్యత, నిర్మాణ, నిర్వహణ లోపాలు, నిబంధనలు పాటించని కారణంగా కుప్పకూలిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పింది. మొదటి నుంచి చివరి వరకు ప్రాజెక్టు దెబ్బతిన్నదని తేల్చింది. ఎన్‌డీఎస్‌ఏ ఇప్పుడు కాదు ఆనాటి ప్రభుత్వంలోనే ఈ విషయం తేల్చుతూ నివేదిక ఇచ్చింది” అని గుర్తుచేశారు.

👉 “ప్రాజెక్టు విషయంలో ప్రజల్లో భ్రమలు కల్పించవద్దు. శాసనసభలో సంపూర్ణంగా చర్చిద్దాం. స్పీకర్  అనుమతితో నిపుణులు, అడ్వకేట్ జనరల్‌ను కూడా సభకు ఆహ్వానిద్దాం. జరిగిన తప్పిదాలను సరిదిద్దుకోవడానికి, సరిదిద్దే ముసుగులో మరింత నష్టం జరగకూడదని నిపుణుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలి.

👉 కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వం ₹ 97 వేల కోట్లు అప్పుచేస్తే ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ₹ 33 వేల కోట్లు అప్పు చెల్లించాం. అప్పులు చెల్లిస్తూ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. గడిచిన 30 నెలల్లో చేయని పని లేదు” అని పేర్కొన్నారు

👉 రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, ఉచిత విద్యుత్, ₹ 500 లకే సిలిండర్, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి అనేక కార్యక్రమాల వివరాలను ముఖ్యమంత్రి  ప్రస్తావించారు. తొలి ఏడాదిలోనే 67,618 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా ? అని ప్రశ్నించారు.

👉 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సన్నబియ్యం, అర్హులైన వారందరికీ రేషన్ కార్డుల జారీ చేశామని గుర్తుచేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ  జయంతి రోజున రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున జీవిత బీమా సౌకర్యం కల్పిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ప్రకటించారు.