క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాలు!


👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగ అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి క్యాష్ రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు.

👉 ఇటీవల విజయవంతంగా జరిగిన సీజన్-1 టీజీ-20 క్రికెట్ లీగ్‌లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను అభినందించిన ముఖ్యమంత్రి  వారికి చెక్కులను అందజేశారు.


👉 క్రీడలకు సంబంధించి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చామని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గతంలో జాతీయ స్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికగా నిలిచిందని గుర్తుచేశారు.


👉 గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమ ప్రతిభను చాటుకునేందుకు టీజీ20 ఒక మంచి అవకాశంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. టీజీ20లో విజయం సాధించిన హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టు సభ్యులందరినీ అభినందిస్తూ, భవిష్యత్తులో దేశ ప్రతిష్ఠను పెంచే క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు.


👉 ఏ రంగంలోనైనా రాణించాలంటే ఫోకస్ అవసరమని, ఎంచుకున్న రంగంపై గౌరవం, ఆసక్తి ఉండాలని క్రీడాకారులకు ముఖ్యమంత్రి  సూచించారు. ఈ కార్యక్రమంలో ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్ , ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్  పాల్గొన్నారు.