👉 ఆసియా అండర్-23 అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థినికి నారిమల్ల ప్రవళిక కు స్వర్ణ పతకం !
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
ఆసియా అండర్-23 అథ్లెటిక్స్‌లో గురుకుల విద్యార్థిని నారిమల్ల ప్రవళిక స్వర్ణ పతకం సాధించడం తెలంగాణకు గర్వకారణం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చాంబర్ లో నారిమల్ల ప్రవళిక ను మంత్రి ఘనంగా సన్మానించి అభినందించారు.
👉 ఈ సందర్భంగా మంత్రి అడ్లురి మాట్లాడుతూ….
చైనాలోని ఓర్డోస్‌లో నిర్వహించిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో భారత జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవడం పట్ల ప్రభుత్వం పక్షాన గర్వంగా ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
👉 తెలంగాణకు చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడా అకాడమీ విద్యార్థిని నారిమల్ల ప్రవళిక సభ్యురాలిగా నిలిచి దేశ ప్రతిష్ఠను ప్రపంచ వేదికపై మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.

👉 నల్గొండ జిల్లా డిండి మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక, సాధారణ కుటుంబం నుంచి అంతర్జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎదిగి దేశానికి స్వర్ణ పతకాన్ని అందించడమే కాకుండా తెలంగాణ యువతలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపిందని మంత్రి కొనియాడారు. ఆమె విజయం గ్రామీణ ప్రాంతాల్లో అపారమైన ప్రతిభ దాగి ఉందనడానికి నిదర్శనమని అన్నారు.
👉 సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం కల్పిస్తూ, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రపంచ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.
👉 ఆధునిక క్రీడా వసతులు, నిపుణుల శిక్షణ, పోషకాహారం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన శిక్షణా అవకాశాలను ప్రభుత్వం నిరంతరం విస్తరిస్తోందని చెప్పారు.
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం క్రీడారంగాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా గుర్తించి, ప్రతిభకు సంపూర్ణ ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
👉 గ్రామీణ ప్రాంతాల నుంచి ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించే తెలంగాణ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్-1 స్థాయి ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం యువ క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
👉 ఈ చారిత్రాత్మక నిర్ణయం తెలంగాణలో క్రీడా సంస్కృతికి మరింత బలాన్ని చేకూర్చి, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో యువతను ముందుకు నడిపిస్తుందని అన్నారు.
👉 ప్రవళికను ఈ స్థాయికి తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన ఆమె కోచ్ పస్పుల పరుశురాముడు, డిండి సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడా అకాడమీ శిక్షక బృందం, తల్లిదండ్రులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఒక క్రీడాకారుడి విజయానికి కుటుంబ సభ్యులు, కోచ్‌లు, శిక్షకుల అంకితభావం ఎంతో కీలకమని అన్నారు.
👉 ప్రవళిక సాధించిన ఈ స్వర్ణ విజయం తెలంగాణ గురుకుల విద్యార్థులకు మాత్రమే కాకుండా రాష్ట్ర యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు, కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్ వంటి అత్యున్నత వేదికలపై మరిన్ని పతకాలు సాధించి భారతదేశానికి, తెలంగాణకు చిరస్థాయి కీర్తి తీసుకురావాలని నారిమల్ల ప్రవళికకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అభినందించి ఆశీర్వదించారు.
