ఓటరు జాబితా లింక్‌తో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు చిక్కులు!

👉 ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు !

👉 2002 రికార్డులు దొరకకపోయినా  ప్రత్యామ్నాయ పత్రాలతో ఫారాలు సమర్పించే అవకాశం !


J.SURENDER KUMAR,


రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో 2002 ఓటరు జాబితాలతో లింక్ చేయడం ప్రధాన సవాలుగా మారింది. 2002 నాటి నియోజకవర్గాల సరిహద్దులు, ప్రస్తుత నియోజకవర్గాల సరిహద్దులు పూర్తిగా మారిపోవడంతో పాత రికార్డులు గుర్తించడం సాధారణ ఓటర్లకు ఇబ్బందిగా మారింది.


చాలాచోట్ల 2002 అదనపు ఓటరు జాబితాలు డిజిటలైజ్ కాకపోవడంతో వెబ్‌సైట్‌లో కూడా వివరాలు అందుబాటులో లేకపోవడం సమస్యను మరింత పెంచుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించింది. క్షేత్రస్థాయిలో ఇంకా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఫారాలు సమర్పించకపోవడం, పట్టణ ప్రాంతాల్లో చిరునామా మారిన వారు, అందుబాటులో లేని వారు, మరణించిన వారి వివరాలు అధికంగా గుర్తించబడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

👉 ఓటర్లు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం !


2002 ఓటరు జాబితాలో పేరు కనిపించకపోయినా ఆందోళన చెందాల్సినఅవసరం లేదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలతో SIR ఫారాన్ని నింపి బీఎల్‌ఓకు సమర్పించే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.

👉 వలసదారుల్లో అయోమయం ,!


ఉపాధి కోసం హైదరాబాద్, ముంబై, భివండి తదితర ప్రాంతాలకు వెళ్లిన వేలాది మంది తమ ఓటును స్వగ్రామంలో ఉంచుకోవాలా? లేక ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి మార్చుకోవాలా? అనే సందిగ్ధంలో ఉన్నారు. గ్రామంలో ఓటు తొలగితే సంక్షేమ పథకాలపై ప్రభావం ఉంటుందేమోనన్న భయంతో చాలామంది ఫారాలు సమర్పించడం లేదు.

👉 హైదరాబాద్‌లో 25 శాతం ఓట్లపై సందిగ్ధత !

హైదరాబాద్ జిల్లాలో సుమారు 47.36 లక్షల ఓటర్లలో 11.52 లక్షల మందిని అధికారులు ప్రాథమికంగా Absent–Shifted–Dead (ASD) జాబితాలో గుర్తించారు. తరచూ ఇళ్లు మారడం, గేటెడ్ కమ్యూనిటీల్లో బీఎల్‌ఓలకు ప్రవేశం లేకపోవడం, ఐటీ ఉద్యోగులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ మందగించింది.

👉 ఓటర్లకు సూచనలు !

బీఎల్‌ఓ ఇంటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా సహకరించండి.
2002 జాబితాలో పేరు లేకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ఆధార్, రేషన్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రాలతో ఫారాన్ని సమర్పించాలి, చిరునామా మారితే వెంటనే సవరణ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆగస్టు 3లోపు ప్రక్రియ పూర్తి చేయాలి.

👉 సవరించిన షెడ్యూల్ !

@ ఇంటింటి సర్వే (BLO):  ఆగస్టు 3, 2026 వరకు


@ ముసాయిదా ఓటర్ల జాబితా:  ఆగస్టు 10, 2026


@ క్లెయిమ్‌లు, అభ్యంతరాలు:  ఆగస్టు 10 – సెప్టెంబర్ 9, 2026


@ తుది ఓటర్ల జాబితా:  అక్టోబర్ 12, 2026

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. చిన్న నిర్లక్ష్యం వల్ల మీ పేరు ఓటరు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఓటరు ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని తన ఓటు హక్కును కాపాడుకోవాలని ఎన్నికల అధికారులు వివరిస్తున్నారు.