దళితుల ఆత్మగౌరవానికి ప్రతిక మా ప్రభుత్వం !

👉 దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగితే సహించం.!

👉 అట్రాసిటీస్‌ చట్టం అమలుపై సీఎం అధ్యక్షతన తొలిసారి ఉన్నతస్థాయి సమీక్ష !

👉 7,563 కేసులు.. బాధితులకు పరిహారం !

👉 ఇందిరమ్మ ఇళ్లలో దళితులకు 31 శాతం..!

👉 ఎస్టీలకు 17 శాతం..!

👉 25 లక్షల ఎకరాలకు అసైన్డ్‌ పట్టాలు ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీదే..!

👉 సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్…!


J.SURENDER KUMAR,

దళితులు, గిరిజనుల ఆత్మగౌరవం, సమానత్వం, హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టం–1989 అమలుపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధ్యక్షతన తొలిసారిగా రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించడం ఇందుకు నిదర్శనమని తెలిపారు. దళితులపై ఇప్పటివరకు 7,563 కేసులు నమోదయ్యాయని, వాటిలో బాధితులకు నిబంధనల మేరకు పరిహారం, ఇతర సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

డా. బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన  మంగళవారం ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీస్‌ నిరోధక) చట్టం–1989 అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది.


👉 సమావేశం అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు……


👉 తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగిందని మంత్రి గుర్తు చేశారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  అధ్యక్షతన రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో చట్టం అమలు తీరు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న ఆర్థిక సహాయం, పునరావాసంపై సమావేశంలో సమగ్రంగా సమీక్షించినట్లు తెలిపారు. చట్టంపై అవగాహన కార్యక్రమాలు, కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానాలు, మొబైల్‌ కోర్టుల పనితీరుపైనా చర్చించినట్లు చెప్పారు.

👉 7,563 కేసులపై సమీక్ష….!

ఇప్పటివరకు 7,563 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ కేసులు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. ఆయా కేసుల్లో బాధితులకు నష్టపరిహారం, ఇతర సహాయ చర్యలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బాధితుల నష్టపరిహారాన్ని బడ్జెట్‌ విడుదలతో ముడిపెట్టకుండా గ్రీన్‌ ఛానల్‌ ద్వారా సత్వరమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

కేసుల దర్యాప్తు, విచారణలో జాప్యానికి తావులేకుండా చూడాలని, బాధితులకు సకాలంలో న్యాయం అందేలా పోలీసు, సంక్షేమ, న్యాయ శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సమావేశంలో స్పష్టం చేసినట్లు మంత్రి తెలిపారు.

👉‘పదేళ్లలో ఒక్క సమావేశం కూడా ఎందుకు నిర్వహించలేదు ?

గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదని మంత్రి ప్రశ్నించారు. దళిత వర్గాలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు జరిగినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోనూ దళితుల సమస్యలపై సమీక్షకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు.
దళితులు కోరుకునేది ఆత్మగౌరవం, సమానత్వం, భద్రత అని మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు.

👉 దళితుల అవమానాన్ని సహించం….!

ఇటీవల శాసనసభలో స్పీకర్‌ కుర్చీ, ఆయన తల్లికి సంబంధించిన అంశంలో చోటుచేసుకున్న పరిణామాలపై దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. అనంతరం ఆ ప్రదేశాన్ని పశువులతో శుద్ధి చేయడాన్ని తప్పుబట్టారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన దళిత నాయకులు కూడా స్పందించకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకునేలా సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.

👉 సీఎం స్వయంగా కేసుల వివరాలు అడిగారు…!

రాష్ట్ర స్థాయి మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా అట్రాసిటీస్‌ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారని మంత్రి తెలిపారు. ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎన్ని కేసుల్లో దర్యాప్తు పూర్తయింది? విచారణ ఏ దశలో ఉంది? బాధితులకు ఆర్థిక సహాయం అందిందా? తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులను వివరాలు అడిగారని చెప్పారు. ఇది ప్రజా ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

👉 25 లక్షల ఎకరాలకు అసైన్డ్‌ పట్టాలు…!

దళితులు, ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. 25 లక్షల ఎకరాలకు అసైన్డ్‌ పట్టాలు అందించిన ఘనత ఇందిరాగాంధీదేనని పేర్కొన్నారు. ఇందిరమ్మ స్ఫూర్తితోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఆయా వర్గాల జనాభా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.

👉 ఇందిరమ్మ ఇళ్లలో 31 శాతం దళితులకు….!

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో 31 శాతం ఇళ్లు దళితులకు, 17 శాతం ఇళ్లు ఎస్టీలకు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.

👉 3.48 కోట్ల మందికి సన్నబియ్యం….!

రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సన్నబియ్యం ద్వారా దళిత, గిరిజన వర్గాలకు నాణ్యమైన ఆహారం అందించగలుగుతున్నామని చెప్పారు.

👉 27.5 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం…!

చదువొక్కటే జీవితాలను మార్చగలదని మంత్రి అన్నారు. అట్టడుగు వర్గాల పిల్లలను విద్య వైపు నడిపించకుండా వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధ్యం కాదన్నారు. రాష్ట్రంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు 27.5 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు.
పిల్లలను చదువుతో పాటు క్రీడల వైపు కూడా ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. దళిత, గిరిజన వర్గాల సమగ్ర అభ్యున్నతికి నాణ్యమైన విద్య అత్యంత కీలకమని చెప్పారు.

👉 హాస్టళ్లకు ప్రతి నెలా నిధులు…..!

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లకు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ప్రతి నెల మొదటి వారంలోనే కాస్మొటిక్‌ ఛార్జీలతో పాటు మెస్‌ ఛార్జీలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

👉‘ఈ ప్రభుత్వం మీది.. మీ కోసం పనిచేస్తుంది’….!

దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆత్మగౌరవం, సమానత్వం, విద్య, ఉపాధి, సంక్షేమం ద్వారా ఆయా వర్గాల జీవితాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.


ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్‌ నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి మంత్రి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీల ఫోరం చైర్మన్ డాక్టర్ మల్లు రవి, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు డా. కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, వెడ్మ బొజ్జు, వేముల వీరేశం , డాక్టర్‌ మట్టా రాగమయి, మురళీ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు
.