👉 ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలి !
👉 25 లక్షల మంది రైతులకు ₹ 20 వేల కోట్ల రుణమాఫీ.. రైతు భరోసా కింద ₹36 వేల కోట్లు !
👉 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్.. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. 16 లక్షల కొత్త రేషన్ కార్డులు!
👉 ధర్మపురి లక్ష్మీనరసింహ గార్డెన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క !
J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి అనుబంధం ఆలయల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ₹117 కోట్లు మంజూరు చేసిందని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి మేరకు మరో ₹ 80 కోట్లు కూడా మంజూరు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. దాదాపు ₹ 200 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.
ధర్మపురిలోని లక్ష్మీనరసింహ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం సందర్భంగా ఆదివారం రాత్రి ధర్మపురి కి చేరుకున్నారు.
👉 ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ……

రేపటి నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధర్మపురికి రావడంలో సుమారు ఐదు గంటలు ఆలస్యమైందని, అయినప్పటికీ ప్రజలు, కార్యకర్తలు ఎంతో ప్రేమాభిమానాలతో తనకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణలు చెబుతూ, ప్రజలు చూపిన ఆప్యాయతకు డిప్యూటీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
👉 శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాధాన్యత, ధర్మపురి క్షేత్ర వైభవం అందరికీ తెలుసునని అన్నారు. గతంలో పలువురు నాయకులు ఆలయ అభివృద్ధిపై ఎన్నో హామీలు ఇచ్చినా అవి అమలుకు నోచుకోలేదన్నారు. ప్రజల ప్రభుత్వం ధర్మపురి ఆలయ అభివృద్ధికి ₹117 కోట్లు మంజూరు చేసిందని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరిన మేరకు మరో ₹ 80 కోట్లు కూడా మంజూరు చేస్తామని ప్రకటించారు.
👉 దాదాపు ₹200 కోట్లతో ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని, క్షేత్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యాలు, ఆలయ వైభవం, మౌలిక వసతులను మెరుగుపరుస్తామని చెప్పారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని, ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.
👉 గత పదేళ్లలో ప్రజలు స్వేచ్ఛ లేకుండా భయంతో జీవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఉప ముఖ్యమంత్రి విమర్శించారు. ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందిందని, తాను ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు అనేక అవమానాలు ఎదుర్కొన్నానని గుర్తుచేశారు.
👉 ప్రజల సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిర్వహించిన ప్రజల మార్చ్, పాదయాత్రలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనతో కలిసి పాల్గొన్నారని గుర్తు చేశారు.
👉 రాష్ట్రంలో ఒక్కో స్కూలుకు 200 కోట్ల నిధులతో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేశామని, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, ఆరోగ్యశ్రీ పరిమితిని ₹10 లక్షలకు పెంచామని చెప్పారు.
👉 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 16 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. ప్రతి రేషన్ కార్డు దారుడికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు.
👉 కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ₹ 5 లక్షల ఇందిరమ్మ భీమా అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, ఈ పథకం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు.
👉 రైతుల రుణమాఫీ కింద 25 లక్షల మంది రైతులకు ₹ 20 వేల కోట్ల మేర ప్రయోజనం కల్పించామని, రైతు భరోసా కింద ₹ 36 వేల కోట్లు అందించామని చెప్పారు. రూ.లక్ష కోట్ల విలువైన పంటలను కొనుగోలు చేశామని, రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. సన్నరకం వరి సాగును ప్రోత్సహించేందుకు ₹ 500/- బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
👉 రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కేవలం ధర్మపురిలో మాత్రమే విద్యుత్ స్తంభాల మార్పిడి కోసం ₹ 6 కోట్లు మంజూరు చేశామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు
👉 మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…..

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతోనే తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టానని అన్నారు. స్వామివారి ఆశీస్సులతో ధర్మపురి అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులకు స్వాగతం పలికారు.
👉 గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురిలో యాగాలు నిర్వహించి ఆలయ అభివృద్ధికి ₹ 500 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం గోదావరి పుష్కరాల సందర్భంగా ₹ 117 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు.
👉 ధర్మపురి అభివృద్ధికి ప్రభుత్వ సహకారం మరింత అవసరమని మంత్రి కోరారు. అక్కపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, పత్తిపాక రిజర్వాయర్, రొల్లవాగు ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
👉 జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ...

తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని కొనియాడారు. అప్పటి ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల సమస్యలను శాసనసభలో బలంగా ప్రస్తావించారని తెలిపారు.
👉 నేడు ఉప ముఖ్యమంత్రిగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ చేయడం ఈ క్షేత్ర చరిత్రలో గొప్ప ఘట్టమని అన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రికి ధర్మపురి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
👉 ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం తెలంగాణలోని ప్రసిద్ధ నవనరసింహ క్షేత్రాల్లో ఒకటని, గోదావరి నది దక్షిణవాహినిగా ప్రవహించడంతో ‘దక్షిణకాశీ’, ‘తీర్థరాజం’, ‘హరిహర క్షేత్రం’గా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉగ్ర నరసింహస్వామి ఆలయాన్ని భక్తుల పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా విస్తరించనున్నారని, మరో వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ స్తపతుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
👉 ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగ లక్ష్మీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ దినేష్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఇతర సీనియర్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
