👉 2029 ఎన్నికల కోసం దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారు !
👉 పేదల ఓటు హక్కును తొలగించడానికే SIR ను తెచ్చారు.!
👉 ప్రతిదిన్’ మీడియా నెట్‌వర్క్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ కార్యక్రమంలో..!
👉 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J . SURENDER KUMAR,
పేదల ఓటు హక్కును తొలగించడానికే SIRను తీసుకొచ్చారు. 2029 ఎన్నికల కోసం దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారు. దేశంలో జనాభా తగ్గకుండా ఓట్లు మాత్రమే ఎలా తగ్గుతాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో జనాభా పెరుగుతున్న సమయంలో ఓటర్ల సంఖ్యలో తగ్గుదల ఎలా జరుగుతుందని సీఎం ప్రశ్నించారు.
ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు, అర్హతల నిర్ధారణ వంటి ప్రక్రియలు స్పష్టంగా, ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలన్నారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చర్యలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
👉 ఓటర్ల జాబితా సవరణ SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల హక్కులు పరిరక్షించబడేలా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు పరిపాలించాలన్నది ప్రజలే నిర్ణయిస్తారని, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని అన్నారు.

👉 అసోం దినపత్రిక ‘ప్రతిదిన్’ మీడియా నెట్‌వర్క్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ది కాంక్లేవ్ 2026’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ‘India’s Next Chapter’ అంశంపై జరిగిన చర్చలో దేశ భవిష్యత్ దిశ, విద్య, నైపుణ్యాభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన SIR తదితర అంశాలపై ముఖ్యమంత్రి విస్తృతంగా మాట్లాడారు.
👉 దేశ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాలకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక రాష్ట్రంలో ఉన్న సామర్థ్యాన్ని అక్కడి స్థానిక వనరులు, మానవ వనరులతోనే అభివృద్ధి చేసే విధంగా కేంద్రం ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
👉 తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి తగిన మద్దతు లభిస్తే రాష్ట్రం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, జాతీయ రహదారులు వంటి కేంద్రం వద్ద సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కీలక ప్రాజెక్టుల విషయాన్ని ప్రస్తావించారు.

👉 నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని ప్రస్తావిస్తూ, జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు భవిష్యత్తులో రాజకీయంగా నష్టం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. 1976లో నియోజకవర్గాల సంఖ్యను స్థిరీకరించిన నిర్ణయం, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ప్రస్తావించారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే పరిస్థితి రాకూడదని అన్నారు.
👉 దేశ రాజకీయాల్లో సంఖ్యాబలం కీలకమని, లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే జాతీయ విధానాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాల వాదన బలహీనపడుతుందని విశ్లేషించారు.
👉 తెలంగాణను.. విద్య, నైపుణ్యాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల ఆధారంగా అభివృద్ధి చేసి, దేశ ప్రగతిలో రాష్ట్రాన్ని కీలక భాగస్వామిగా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. యువతకు విద్యతో పాటు అవసరమైన నైపుణ్యాలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
👉 ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, నర్సరీ విద్య వంటి అంశాలపై ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని విద్యా రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించేలా విద్యా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

👉 నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యతో పాటు భాష, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని, 12వ తరగతి తర్వాత విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు.
👉 బ్రిటిషర్లు సైమన్ కమిషన్‌ను వాడుకున్నట్లుగా మోడీ ఈసీని వాడుకుంటున్నారు. శివుడు పేదోళ్ల దేవుడు.. శ్రీరాముడు ఉన్నోళ్ల దేవుడు. దక్షిణాది వాళ్లంతా ద్రవిడులు.. ఉత్తరాది వాళ్లు ఆర్యులు. మోడీ ఎందుకు హరహర మహదేవ్ అనరు. జైశ్రీరాం అని మాత్రమే మోడీ ఎందుకంటారు.? 2014-18 మధ్య నేను అసెంబ్లీకి వెళ్లింది తక్కువ.. జైలుకు వెళ్లింది ఎక్కువ అని సీఎం అన్నారు
