👉 కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించాలి !
👉 ఆహారం, పారిశుధ్యం, ఉపాధ్యాయులు–విద్యార్థుల హాజరు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి !
👉 ఫుడ్ పాయిజనింగ్, ఎలుకలు, పాముకాటు ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు !
👉 శీతాకాలం దృష్ట్యా వెచ్చని నీరు, దుప్పట్లు ముందుగానే అందుబాటులో ఉంచాలి !
👉 దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన యూనిఫారాలు అందేలా చర్యలు !
👉 జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు..!
J SURENDER KUMAR,
రాష్ట్రంలోని పాఠశాల విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పటిష్టంగా పర్యవేక్షిస్తూ, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సోమవారం రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
👉 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ,….

రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యతో పాటు మౌలిక వసతులపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. రెసిడెన్షియల్ విద్యాసంస్థలను క్రమం తప్పకుండా ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు.
👉 ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నప్పటికీ కొన్ని చోట్ల ఫుడ్ పాయిజనింగ్, ఎలుకలు, పాముకాటు వంటి ఘటనలు చోటు చేసుకోవడం పై ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని సీఎస్ ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
👉 రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఆహారం తయారీ, ఆహార పదార్థాల నిల్వ, వినియోగంలో నిర్దేశిత ప్రామాణిక నిర్వహణ విధానాలను తప్పనిసరిగా పాటించాలని సీఎస్ తెలిపారు. విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత, పారిశుధ్య నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతుల లోపాలు తదితర అంశాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. సాధ్యమైన చోట్ల వంటశాలల ఆధునీకరణ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు.
👉 రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఉన్నతస్థాయిలో పర్యవేక్షించేందుకు రూపొందించిన డ్యాష్‌బోర్డ్‌ను కలెక్టర్లు క్రమం తప్పకుండా పరిశీలించాలని సంజయ్ జాజు తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు అందుతున్నాయా లేదా, ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించి, వాటి వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన మార్పులు, సమస్యల పరిష్కార చర్యలను కూడా పోర్టల్‌లో నిరంతరం అప్‌డేట్ చేయాలని సూచించారు.
👉 జిల్లాలో రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు సంబంధించి ఏదైనా ప్రతికూల నివేదిక వచ్చినప్పుడు సంబంధిత అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సీఎస్ సూచించారు. తప్పుడు సమాచారం ప్రచారంలో ఉన్నట్లు తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, వాస్తవంగా ఏదైనా సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వం డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలను పెంచి అమలు చేస్తోందని, కాస్మెటిక్ ఛార్జీలను ప్రస్తుతం డీబీటీ ద్వారా అందిస్తున్నట్లు తెలిపారు.
👉 రానున్న శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థులకు స్నానానికి వెచ్చని నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన దుప్పట్లను ముందుగానే సమకూర్చాలని సీఎస్ ఆదేశించారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ విద్యాసంస్థల భవన యజమానులతో కలెక్టర్లు సమావేశమై అవసరమైన మార్పులు, మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
👉 ప్రతి ఉపాధ్యాయుడికి అవసరమైన శిక్షణ అందేలా చర్యలు చేపట్టాలని సీఎస్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రతిరోజూ ఒక లక్ష యూనిఫారాలు కుట్టేలా చర్యలు చేపట్టాలని, దసరా నాటికి ప్రతి విద్యార్థికి రెండు జతల కుట్టిన యూనిఫారాలు అందేలా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. యూనిఫాం క్లాత్ ఇప్పటికే జిల్లాలకు చేరినందున కుట్టు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

👉 రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలు, సమస్యల పరిష్కార వివరాలను ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో క్రమం తప్పకుండా నవీకరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లను ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల పర్యవేక్షణ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
